ప్రాణం ఉన్నంతవరకు మునుగోడుతోనే : కోమటిరెడ్డి

by Disha Web Desk 11 |
ప్రాణం ఉన్నంతవరకు మునుగోడుతోనే : కోమటిరెడ్డి
X

దిశ,సంస్థాన్ నారాయణపురం: నా ప్రాణం ఉన్నంతవరకు మునుగోడు ప్రజలతోనే ఉంటానని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామ శివారు నుంచి ర్యాలీగా స్థానిక చౌరస్తా వరకు వచ్చారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసమే తామంతా పార్లమెంట్లో పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించామన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధిస్తే అందులో కేసీఆర్ కుటుంబం పదవులను అనుభవించి కోట్లాది రూపాయల ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని లూటీ చేసి ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచారన్నారు.

కెసిఆర్ కుటుంబమంతా అవినీతిలో మునిగి తేలారని ద్వజమెత్తారు. అందుకే కవిత లిక్కర్ కేసులో జైల్లో ఉన్నారన్నారు. త్వరలోనే కెసిఆర్, కేటీఆర్ ,హరీష్ రావులు కూడా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. జైల్లో వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామన్నారు. గత మునుగోడు ఉప ఎన్నికల్లో నన్ను ఒక్కడిని ఓడించడానికి కేసీఆర్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం మునుగోడుకు తీసుకువచ్చారన్నారు. సాధారణ ఎన్నికల్లో మళ్లీ మునుగోడు ప్రజలు తనను 40 వేల మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తాను ఓడినా గెలిచినా మునుగోడు నియోజకవర్గాన్ని వదిలిపెట్టనని ప్రజలకు హామీ ఇచ్చారు. మునుగోడుకు సాగునీరు అందించి రైతుల కష్టాలను తీరుస్తానన్నారు. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తూ సంతోషంగా ఉన్నారని అన్నారు.

తాను చౌటుప్పల్ నుంచి నారాయణపూర్ వరకు ఆర్టీసీ బస్సులోనే వచ్చానని వారితో ముచ్చటించానని తెలిపారు. ఎన్నికల అనంతరం మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడిపిస్తానని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామనీ తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒకటి కూడ నెరవేర్చలేదు అన్నారు. దళితులకు మూడు ఎకరాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చాడా అని ప్రజలను ప్రశ్నించారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వాన్ని మీరంతా సాగనంపారని తెలిపారు. భువనగిరి పార్లమెంటు స్థానంలో యువకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై ఉంచారని గుర్తు చేశారు. తనను గెలిపించిన మీరంతా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్ ను ఓడించినట్లుగానే దేశంలో బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని కోరారు. భువనగిరి నియోజకవర్గాన్ని అనే విధాలుగా అభివృద్ధి చేస్తానని వివరించారు.నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చానని ఇక్కడి ప్రజల బాధలు కష్టసుఖాలు తనకు తెలుసని ఆయన అన్నారు. గత పది సంవత్సరాల పాలనలో కెసిఆర్ ప్రభుత్వం ఏనాడు ప్రజలను పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ పాలనంత అవినీతిమయంగా మారి ప్రజల నెత్తిన అప్పులు పెట్టారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని బిజెపి ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు.

బిఆర్ఎస్ బిజెపి పార్టీల మాటలు నమ్మొద్దని కోరారు. రాజన్నను గెలిపించినట్లే తనను గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పున్న కైలాస నేత, ఎంపీపీ గుత్తా ఉమా దేవి, జడ్పిటిసి వీరమల్ల భానుమతి, మన్నే నర్సింహారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏపూరి సతీష్, నాయకులు మందుగుల బాలకృష్ణ, ఉప్పల లింగస్వామి, ముద్దంగుల నరసింహ, జక్కడి చంద్రారెడ్డి, ఎండి అక్బర్, కుక్కల నరసింహ, కరెంటోతూ బిక్షపతి నాయక్ , శ్రీను నాయక్, పరసబోయిన నరసింహ, గుత్తా శేఖర్ రెడ్డి, కత్తుల లక్ష్మయ్య, గణం అంజయ్య, పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed