పెను మార్పులకు దారి తీయనున్న ‘లోక్‌సభ’ ఫలితాలు.. ఆగస్టు సంక్షోభం తప్పదా..?

by GSrikanth |
పెను మార్పులకు దారి తీయనున్న ‘లోక్‌సభ’ ఫలితాలు.. ఆగస్టు సంక్షోభం తప్పదా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలను మూడు ప్రధాన పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తాచాటాలనుకుంటోంది. మిషన్-15 పేరుతో లక్ష్యంగా ప్రచారం నిర్వహించింది. ఎవరి ఊహకు అందని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ నాలుగు చోట్ల విజయం సాధించింది. అదే ఊపుతో ఈసారి రాష్ట్రంలో డబుల్ డిజిట్‌ను లక్ష్యంగా పెట్టుకున్నది. పదేండ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తన తొమ్మిది సిట్టింగ్ స్థానాలను నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఈసారి ముక్కోణపు పోటీ అనివార్యం కావడంతో మూడు పార్టీలూ పోటాపోటీ వ్యూహాలు రచించుకున్నాయి. రెండు నెలల ప్రచారం ముగియడంతో ఇప్పుడు ఓటర్లను ప్రలోభాలతో ఆకర్షించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ ఫలితాలు ఆ పార్టీలపై ఒక్కో రకమైన ప్రభావం చూపనున్నాయి.

పాలనకు రెఫరెండం అన్న సీఎం

వంద రోజుల్లో గ్యారంటీల అమలు, నాలుగైదు నెలల తమ పాలనకు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రెఫరెండం అని ముఖ్యమంత్రి రేవంత్ ఓపెన్‌గానే చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సైతం తెలంగాణను కీలకంగా తీసుకోవడంతో 17 స్థానాల్లో కనీసం 15 గెలవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఈ మేరకు మిషన్-15 రూపొందించారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ తదితరులు రాష్ట్రంలోని పలు సెగ్మెంట్లలో జనజాతర సభల్లో, స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో పాల్గొన్నారు. లక్ష్యానికి తగినట్లుగా సీట్లు వస్తే రాష్ట్రంలో పార్టీ మరింత బలపడడమే కాకుండా.. పీసీసీ చీఫ్‌గా, సీఎంగా రేవంత్ తన స్థానాన్ని మరింత బలపర్చుకోడానికి దోహదపడుతుంది. మరోవైపు.. అన్ని సెగ్మెంట్లలోనూ మంత్రులకే టాస్క్ ఇవ్వడంతో వారివారి ప్రాంతాల్లో అభ్యర్థులను గెలిపించుకునేందుకు శ్రమిస్తూనే ఉన్నారు. అయితే.. కాంగ్రెస్‌కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోతే పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు పార్టీలోనూ అంతర్గతంగా విభేదాలకు, భిన్నాభిప్రాయాలకు దారితీసే అవకాశమున్నదని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో ఆరు ఖాళీల భర్తీతోపాటు నామినేటెడ్ పోస్టుల్లోనూ ఇది ప్రభావం చూపే అవకాశమున్నదనే వాదనా వినిపిస్తున్నది. దీనికితోడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్లాన్‌కు సైతం చిక్కులు తలెత్తే చాన్స్ లేకపోలేదు. తక్కువ సీట్లకే పరిమితం అయినట్లయితే పార్టీ పట్ల ప్రజల్లోనూ విశ్వసనీయత సమస్య తలెత్తే ప్రమాదముంటుందనే ఆందోళనా ఉన్నది. రేవంత్‌రెడ్డికి తన సొంత జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను, ఇప్పటివరకూ సిట్టింగ్‌గా ఉన్న మల్కాజిగిరిని నిలబెట్టుకోవడం సవాల్‌గా మారింది.

పవర్‌పై కమలం ఫోకస్

ప్రస్తుతం నాలుగు ఎంపీ సీట్లకు మాత్రమే పరిమితమైన బీజేపీ ఈసారి డబుల్ డిజిట్‌పై కన్నేసింది. తెలంగాణలో గెలుపును ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అనుకున్న స్థాయిలో సీట్లు సాధిస్తే.. పవర్‌లోకి రావచ్చని పార్టీ ఆలోచన. రాష్ట్రంలో అధికారంలోకి రావడం ద్వారా సౌత్ ఇండియాలో పార్టీ విస్తరణకు మార్గం సుగమమవుతుందని భావించి తెలంగాణను ‘గేట్ వే’గా నిర్దేశించుకున్నది. ఈ కారణంగానే ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు నామినేషన్ల దాఖలుతో మొదలుపెట్టి.. ప్రచారం ముగిసే వరకు సీరియస్‌గా తీసుకున్నారు. బహిరంగసభలు, రోడ్ షోలు, ర్యాలీలు, స్ట్రీట్ కార్నర్ మీటింగులతో చివరి వారంలో ప్రచారం జోరును పెంచారు. ఈ ఫలితాలపైనే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

మనుగడ కోసం పాకులాట

గత ఎన్నికల్లో తొమ్మిది ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైంది. దీంతో ఈ ఎన్నికలు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఒకవైపు లీడర్లు, కేడర్ చేజారిపోతున్న సమయంలో ఇప్పుడు ఎన్ని ఎక్కువ స్థానాల్లో గెలిస్తే ఆ పార్టీ భవిష్యత్తు అంత పదిలంగా ఉంటుందన్నది గులాబీ లీడర్ల అభిప్రాయం. అనారోగ్యం వెంటాడుతున్నా నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగి 16 రోజులపాటు బస్సు యాత్రతో రాష్ట్రమంతటా చుట్టేశారు. ఒకవైపు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలోని లీడర్లు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సీట్లు సాధిస్తేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందనేది కేసీఆర్‌ ఆలోచన. అయితే.. గతంకంటే ఒక సీటు ఎక్కువే వస్తుందనే ధీమాను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. డజనుకు తగ్గవంటూ స్వయంగా కేసీఆరే ప్రకటించుకున్నారు. రాష్ట్రంలో ఒక్క సీటైనా వస్తుందా..? అనే చర్చ జరుగుతున్న క్రమంలోనూ కేసీఆర్‌లో ఆ ధైర్యం ఏంటనేది అర్థం కాకుండా ఉంది. జూన్ 4న వెలువడే ఫలితాలు మిగిలిన రెండు పార్టీలపై ఒక రకమైన ప్రభావం చూపితే.. బీఆర్ఎస్ విషయంలో మాత్రం భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తుందనే చర్చ జరుగుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు జూన్ 4న పాతిక మంది చేరుతారని, ఆ పార్టీలో మిగిలేది కల్వకుంట్ల కుటుంబానికి చెందిన నలుగురేనని ఓపెన్ కామెంట్లు చేస్తున్నారు.

ఆగస్టు సంక్షోభం తప్పదా..?

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌లపై వేర్వేరు రూపాల్లో ప్రభావం చూపనున్నాయి. ఈ ఫలితాలు ఊహకు అందని తీరులో రాజకీయంగా పెను మార్పులకు దారితీస్తుందనే చర్చ సైతం జరుగుతోంది. జూన్ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగడం కష్టమని, ముఖ్యమంత్రే బీజేపీలోకి వెళ్లిపోతారని, కాంగ్రెస్‌లోనే అంతర్గత ఘర్షణలు బహిర్గతమవుతాయని బీఆర్ఎస్ నేతలు తరచూ చేస్తున్న కామెంట్లు. ‘ప్రభుత్వం కూలిపోవడం ఖాయం.. మా అంతట మేం పడగొట్టం.. కానీ కాపాడడానికి మేం చేయగలిగిందేమీ లేదు. రాష్ట్రంలో ‘ఆగస్టు సంక్షోభం’ తప్పదు’ అంటూ బీజేపీ నేతలు అంటున్నారు. దీంతో జూన్ 4న వెలువడే ఫలితాల అనంతరం చోటుచేసుకునే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయా అనేది ఆసక్తికరంగా మారాయి.

Advertisement

Next Story

Most Viewed