Exit Polls: ఏం ఆరా తీశారో ? నేడు ఎగ్జిట్ పోల్స్ వెల్లడి..

by Indraja |
Exit Polls: ఏం ఆరా తీశారో ? నేడు ఎగ్జిట్ పోల్స్ వెల్లడి..
X

దిశ ప్రతినిధి, గుంటూరు: తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఈ నెల 13 న జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అన్న దానిపై సర్వే సంస్థలు ప్రకటించే ఫలితాపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగులోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై అన్ని రాజకీయ పక్షాల్లో ఆసక్తి నెలకొంది. దక్షిణ భారతదేశంలో ఏపీలోని టీడీపీ, జనసేన మాత్రమే ఎన్డీఏలో చేరాయి.

ఇదొక కారణంగా చెప్పుకోవాల్సి ఉంది. ఈ కారణంగా ఏపీ ఎన్నికలు మునుపెన్నడూ లేనివిధంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో కులం, ధనం ప్రధాన పాత్ర పోషించాయి. దీంతో దేశ విదేశాల నుంచి ఓటర్లు వచ్చి ఓటు వేశారు. దీని కారణంగా పోటీ చేసిన అభ్యర్థులకు తడిసి మోపెడయ్యింది.

స్వస్థలం నుంచే ఆరా మస్తాన్ ..

జూన్ 1 సాయంత్రం 6 తరువాత సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటించుకోవచ్చని ఈసీ అనుమతించింది. శనివారం సాయంత్రం పోస్ట్ పోల్ ఎగ్జిట్ ఫలితాలు ప్రకటించేందుకు పలు ప్రముఖ సర్వే సంస్థలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాల గురించి ఆరా సంస్థ ముందుగా చెప్పినట్టుగానే కాంగ్రెస్ గెలిచింది. దీంతో ఆరా మస్తాన్ సర్వే ఫలితాలు ఏ విధంగా ప్రకటిస్తారు అన్నది చాలా మందిలో ఆసక్తి నెలకొంది.

ఆరా మస్తాన్ ఈ సారి చిలకలూరిపేట సమీపంలో ఉన్న తన స్వస్థలం మద్దిరాలలో ఫలితాలు ప్రకటించనున్నారు. అలాగే ఈసారి ఎన్నికల్లో సర్వే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఎన్నికల ముందు నుంచి పలు సంస్థలు రకరకాల పేర్లతో టీడీపీ గెలుస్తుందని కొన్ని, వైసీపీ గెలుస్తుందని మరికొన్ని సంస్థలు ఊదర గొట్టాయి. తెలుగు సర్వే సంస్థల ఫలితాలను తెలుగు ప్రజలు పెద్దగా విశ్వసించ లేదు.

జాతీయ సంస్థలు సైతం..

ఐతే జాతీయ మీడియా సంస్థలు కూడా ఏపీ ఎన్నికలపై సర్వేలు చేసి ముందుగానే ఫలితాలు ప్రకటించాయి. వాటి లో ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి దశ శనివారం ము.6 గంటలకు జాతీయ, ప్రాంతీయ మీడియా, సర్వే సంస్థలు తమ అంచనాలు ప్రకటించనున్నాయి. కొంత మంది సర్వే సంస్థల అధిపతులను కొన్ని రాజకీయ పక్షాల నాయకులు బెదిరించారని తమకు అనుకూలంగా చెప్పాలని ఒత్తిడి చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

ఇందులో వాస్తవం ఎంత అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఎన్నికల గురించి సర్వే సంస్థల ఫలితాలతో శనివారం తెలుగు ప్రజలలో ఉత్కంఠకు తెరపడనుంది. జాతీయ మీడియా కూడా ఏపీపై ముందస్తు ఫలితాలు ప్రకటించనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed