‘బాధ్యతను విస్మరిస్తే.. వెంటపడి మరీ పనిచేయిస్తాం’

by Gantepaka Srikanth |
‘బాధ్యతను విస్మరిస్తే.. వెంటపడి మరీ పనిచేయిస్తాం’
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజిగిరి తన సీటని, మహబూబ్‌నగర్ తన సొంత నియోజకవర్గమని విర్రవీగాడని, కానీ ప్రజలు ఆయనకు గట్టి బుద్ధి చెప్పారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం మోడీని మూడోసారి ప్రధాని చేయాలని ఓటేశారన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు 35 శాతానికి పెరిగిందన్నారు. భవిష్యత్తులో తెలంగాణకు బీజేపీయే ప్రత్యామ్నాయమని ఈటల చెప్పారు. గెలిచిన 8 మంది ఎంపీలు అపార అనుభవం కలిగిన వ్యక్తులని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర సహాయ సహకారాలను తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తే.. వెంటపడి మరీ పనిచేయిస్తామని ఈటల స్పష్టం చేశారు.

నెహ్రూ తరువాత మూడోసారి ప్రధాని కాబోతున్న వ్యక్తిగా మోడీ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ తప్పితే అన్ని స్థానాల్లో సెకండ్ ప్లేస్‌లో ఉన్నామన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటే మల్కాజిగిరి, మహబూబ్ నగర్‌లో ఎందుకు గెలవలేదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఇండియా కూటమి అధికారం చేపడుతుందని వెకిలి మాటలు మాట్లాడుతున్నారని ఈటల ధ్వజమెత్తారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేశారని ఈటల చెప్పారు. చంద్రబాబును, నితీష్ కుమార్‌ను కలుస్తామని కాంగ్రెస్ నేతలు అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని ఈటల ఫైరయ్యారు. ఐదేళ్లు సంపూర్ణంగా సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో పేదవారికి సొంత ఇండ్లు కట్టించడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed