కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు

by GSrikanth |
కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. తెలంగాణలో కొందరు పోలీసు అధికారులను బదిలీ చేసి స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. గత నెల 16 నుంచి తెలంగాణలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఓ సామాజికవర్గానికి చెందిన అధికారులను లక్ష్యంగా చేసుకుని కొందరు పోలీసు అధికారులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తద్వారా బీఆర్‌ఎస్‌ ప్రతిష్టను దెబ్బతీసి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనుకూల వాతావరణం ఏర్పడేలా పనిచేస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌ నుంచి ఎప్పటికప్పుడు అందుతున్న ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, వెస్ట్‌జోన్‌ డీసీపీ ఎస్‌.విజయ్‌కుమార్‌తో పాటు విచారణ అధికారిగా ఉన్న బంజారాహిల్స్‌ ఏసీపీ వెంకటగిరి కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు.

ఫోన్‌ ట్యాపింగులో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాత్ర ఉందంటూ వాళ్లకు సంబంధించిన మీడియాకు లీకులు ఇస్తున్నారన్నారన్నారు. కేటీఆర్‌‌పై ఓటమి పాలైన కేకే మహేందర్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చేసిన నిరాధార ఫిర్యాదులను పోలీసులు స్వీకరించి కేసులు నమోదు చేసినట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. కేటీఆర్‌ చేత జైలు కూడు తినిపిస్తానని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, సీఎం అయిన తర్వాత రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని పలు ఆధారాలను కూడా ఫెన్ డ్రైవ్‌లో ఈసీకి అందజేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌లో కేసీఆర్‌, కేటీఆర్‌పై త్వరలో కేసులు నమోదు అవుతాయని మంత్రులు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేయాలని పోలీసు, రెవెన్యూ యంత్రాంగంపై సీఎం రేవంత్‌ ఒత్తిడి తెస్తున్నారన్నారు.​

బీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌, కేటీఆర్‌పై దురుద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. అరెస్టు చేయించడం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బ తీసి లబ్దిపొందాలని ప్రయత్నిస్తున్నాడని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుకూలమైన మీడియా సంస్థలకు లీకులు ఇస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై విచారణ జరిపి బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed