ఐపీఎల్ శాలరీపై రింకు సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Harish |
ఐపీఎల్ శాలరీపై రింకు సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ ద్వారా అనతి కాలంలోనే స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు రింకు సింగ్. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను గతేడాది జాతీయ జట్టులోకి వచ్చాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత రిజర్వ్ ప్లేయర్‌గా కూడా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే, కేకేఆర్ సహచర ఆటగాళ్లతో పోలిస్తే ఐపీఎల్‌లో అతని సంపాదన తక్కువే. ఐపీఎల్‌లో అతను రూ. 55 లక్షలే సంపాదిస్తున్నాడు. తాజాగా ఐపీఎల్ శాలరీపై రింకు సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తోటి ఆటగాళ్లతో పోలిస్తే తక్కువ సంపాదించడంపై ప్రశ్న ఎదురవ్వగా.. రింకు అదిరిపోయే సమాధానమిచ్చాడు. డబ్బు లేని రోజులు చూశానని, తనకు రూ. 55 లక్షలు చాలా ఎక్కువ అని చెప్పాడు. ‘రూ. 55 లక్షలు నాకు చాలా ఎక్కువ. నేను కెరీర్ మొదలుపెట్టినప్పుడు ఇంత సంపాదిస్తానని అస్సలు అనుకోలేదు. నా చిన్నతనంలో రూ. 5 సంపాదించా.. ఇప్పుడు రూ. 55 లక్షలు సంపాదిస్తున్నా. డబ్బు లేని రోజులు చూశా. అందుకే నాకు డబ్బు విలువ తెలుసు. దేవుడు ఇచ్చిన దాంతో నేను సంతోషంగానే ఉన్నా. ఇదే నా ఆలోచన. మనం వచ్చేటప్పుడు ఏం తీసుకరాలేదు. వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్లం. కాలం ఎప్పుడు మారుతుందో తెలియదు. ఎప్పుడు నేలపైనే ఉండండి.’ అని చెప్పాడు.

అప్పుడు బాధ పడ్డా..

టీ20 ప్రపంచకప్‌‌కు ఎంపిక చేసిన భారత జట్టులో రింకు సింగ్‌కు చోటు దక్కలేదు. కేవలం అతన్ని రిజర్వ్ ప్లేయర్‌గా మాత్రమే ఎంపిక చేశారు. అతన్ని పక్కనపెట్టడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై రింకు సింగ్ స్పందిస్తూ.. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదని తెలిసినప్పుడు బాధపడ్డాడనని తెలిపాడు. ‘మంచి ప్రదర్శన చేసినప్పటికీ ఎంపిక కాకపోతే ఎవరైనా బాధపడతారు. జట్టు కాంబినేషన్ వల్ల నేను ఎంపికవ్వలేదు. మన చేతుల్లో లేనిదాని గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. ఏది జరిగినా అది మన మంచికే.’ అని తెలిపాడు. జట్టు ఎంపిక తర్వాత ఐపీఎల్‌లో ముంబై, కోల్‌కతా మ్యాచ్ సందర్భంగా రోహిత్ తనతో మాట్లాడాడని రింకు చెప్పాడు. ‘ఎక్కువగా ఆందోళన చెందొద్దని, మరో రెండేళ్లలో వరల్డ్ కప్ వస్తుందని రోహిత్ భయ్యా చెప్పాడు. అతను యువకులకు మద్దతుగా నిలుస్తాడు. బాగా ఆడాలని ప్రోత్సహిస్తాడు.’ అని రింకు చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed