T20 World Cup : సూపర్-8లో నేడు బంగ్లాతో టీమ్ ఇండియా ఢీ.. గెలిస్తే సెమీస్‌కు చేరుకున్నట్టే?

by Harish |
T20 World Cup : సూపర్-8లో నేడు బంగ్లాతో టీమ్ ఇండియా ఢీ.. గెలిస్తే సెమీస్‌కు చేరుకున్నట్టే?
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా కీలక పోరుకు సిద్ధమైంది. గత మ్యాచ్‌లో అఫ్గాన్‌ను చిత్తు చేసి సూపర్-8 రౌండ్‌లో బోణీ కొట్టిన రోహిత్ సేన.. నేడు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో నెగ్గితే దాదాపు సెమీస్ బెర్త్ ఖరారైనట్టే. ఒకవేళ ఓడితే సెమీస్ బెర్త్ గల్లంతయ్యే ప్రమాదం లేకపోలేదు. ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఏదైనా జరగొచ్చు. కాబట్టి, బంగ్లాతో పోరు టీమ్ ఇండియాకు చాలా కీలకం కానుంది. అయితే, బంగ్లాను దాటడం అంత ఈజీ కాదు. చరిత్ర చూసుకున్నా.. ప్రస్తుత జట్ల ప్రదర్శనను పోల్చినా బంగ్లాపై విజయం భారత్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ, బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో నాణ్యమైన ఆటగాళ్లను కలిగి ఉన్న ఆ జట్టుతో జాగ్రత్తగా ఆడాల్సిందే. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిస్తే రోహిత్ సేన గెలుపు సులువే.

శుభారంభం కావాలి

టీ20 ప్రపంచకప్‌లో జట్టును ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఓపెనర్లు రోహిత్, విరాట్ విఫలమవ్వడమే. గత మ్యాచ్‌లో అఫ్గాన్‌పై రోహిత్ 8 పరుగులకే వెనుదిరగగా.. కోహ్లీ(24) టోర్నీలో మొదటిసారి రెండెంకల స్కోరు చేశాడు. వీరు జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమవుతున్నారు. సెమీస్‌కు ముందు వీళ్లు ఫామ్ అందుకోవడం చాలా కీలకం. పంత్, సూర్య, పాండ్యా టచ్‌లో ఉండటం సానుకూలంశం. దూబె ఫామ్ కూడా జట్టును ఆందోళకు గురి చేస్తోంది. జడేజా, అక్షర్ నుంచి జట్టు మంచి ఇన్నింగ్స్ ఆశిస్తోంది. బౌలింగ్ పరంగా భారత్‌కు తిరుగులేదని చెప్పొచ్చు. బుమ్రా, అర్ష్‌దీప్ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నారు. స్పిన్నర్ కుల్దీప్ కూడా తన సత్తా ఏంటో గత మ్యాచ్‌లో చూపించాడు. పాండ్యా కూడా టచ్‌లోనే ఉన్నాడు.

బంగ్లాలో వీళ్లు కీలకం

బంగ్లా జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. గ్రూపు దశలో ఆ జట్టు శ్రీలంకను చిత్తు చేసింది. సౌతాఫ్రికాతో ఓడినా గెలిచినంత పనిచేసింది. తౌహిద్ హృదోయ్, కెప్టెన్ శాంటో, లిటాన్ దాస్ నిలకడగా రాణిస్తున్నారు. అలాగే, బంగ్లా బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. తాంజిమ్ హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, రిషద్ హుస్సేన్‌‌లతో భారత బ్యాటర్లకు సవాల్ తప్పదు.

భారత్ 12.. బంగ్లా 1

టీ20ల్లో భారత్, బంగ్లా జట్లు ఇప్పటివరకు 13సార్లు ఎదురుపడ్డాయి. అందులో 12 విజయాలతో భారత్‌దే ఆధిపత్యం. ఒక్కసారి మాత్రమే బంగ్లాదేశ్ విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు నాలుగుసార్లు తలపడగా.. అన్నింటా టీమ్ ఇండియాదే గెలుపు.

పిచ్ రిపోర్టు

నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం పిచ్ బౌలర్లకు, బ్యాటర్లకు సమానంగా అనుకూలించనుంది. టాస్ గెలిచిన జట్టు చేజింగ్‌కు మొగ్గు చూపొచ్చు.

తుది జట్లు(అంచనా)

భారత్ : రోహిత్(కెప్టెన్), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, శివమ్ దూబె/శాంసన్, పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, అర్ష్‌దీప్.

బంగ్లాదేశ్ : తాంజిద్ హసన్, లిటాన్ దాస్, శాంటో(కెప్టెన్), షకీబ్, తౌహిద్ హృదోయ్, మహ్మదుల్లా, మహేది హసన్, రిషద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, తాంజిమ్ హసన్, ముస్తాఫిజుర్.

Advertisement

Next Story