ప్రియురాలు మరణం తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య

by Sridhar Babu |
ప్రియురాలు మరణం తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య
X

దిశ, దుండిగల్ : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో కొన్ని రోజుల క్రితం ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన తేజస్విని, శ్రీహరి లు ప్రేమలో పడ్డారు. కుటుంబ తగాదాలతో మనోవేధనకు గురైన బి ఫార్మసీ విద్యార్థిని తేజస్విని గురువారం భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. తేజస్విని మృతికి శ్రీహరి కారణం అని అందరూ నిందిస్తుండడంతో పాటు ప్రేమించిన ప్రియురాలు దక్కక మనోవేధనకు గురైన శ్రీహరి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాంతో సురారంలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి ఆసుపత్రి నుంచి పరారయ్యాడు.

ఈ మేరకు సూరారం పోలీస్ స్టేషన్ లో శ్రీహరి సోదరి ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బహుదూర్ పల్లి సాయినాథ్ సొసైటీలో చెట్టుకు ఉరి వేసుకొని ఓ వ్యక్తి కనిపించడంతో స్థానికులు పోలీస్ లకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆస్పత్రి నుంచి పరారైన శ్రీహరిగా గుర్తించారు. అతను సెల్ ఫోన్ లో స్నాప్ చాట్ ద్వారా స్నేహితులకు రాసి ఉన్న ఓ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్​లో తన చావుకు బీజేపీ నాయకుడు కారణమంటూ ఉంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీస్ లు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ తగాదాల వల్ల ఇది జరిగి ఉంటుందని సూరారం సీఐ భరత్ కుమార్ తెలిపారు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు గుమ్మడిదల పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story