road accident : ఫ్లైఓవర్ గోడను ఢీ కొని కిందపడి ఇద్దరు యువకులు మృతి

by Sridhar Babu |
road accident : ఫ్లైఓవర్ గోడను ఢీ కొని కిందపడి ఇద్దరు యువకులు మృతి
X

దిశ, శేరిలింగంపల్లి : అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఓవర్ స్పీడ్ తో బైక్ నడిపి ఫ్లై ఓవర్ పై నుండి కిందకు పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం తెల్లవారుజామున గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని కొండాపూర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా విప్పర్ల గ్రామానికి చెందిన బాల ప్రసన్న (24), గుంటూరు జిల్లా మరిచెట్టు పాలెం గ్రామానికి చెందిన రోహిత్(26) ఇద్దరు

నగరంలోని హఫీజ్ పేట్ లో ఉంటున్నారు. వీరిలో రోహిత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుండగా, బాల ప్రసన్న ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. వీరు ఆదివారం తెల్లవారుజామున మజీద్ బండ వైపు నుండి ద్విచక్ర వాహనంపై హఫీజ్ పేట్ వైపు వేగంగా వస్తుండగా కొత్తగూడ ఫ్లైఓవర్ గోడను ఢికొని పై నుండి కింద పడ్డారు. కిందపడిన రోహిత్, బాల ప్రసన్న తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రోహిత్, ప్రసన్న మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story