పాత కక్షలతో ఇద్దరిపై దాడి ఒకరి మృతి

by Sridhar Babu |
పాత కక్షలతో ఇద్దరిపై దాడి ఒకరి మృతి
X

దిశ, కూకట్​పల్లి : పాత కక్షలతో ఓ వ్యక్తి, అతడి తల్లిపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన బాలానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని సంజీవయ్య కాలనీలో చోటు చేసుకుంది. బాలానగర్​ సీఐ నవీన్​ తెలిపిన వివరాల ప్రకారం సంజీవయ్య కాలనీలో నివాసం ఉంటున్న ఎరుపుల ముకేందర్​(42) మంగళవారం మధ్యాహ్నం తన తల్లి సావిత్రితో కలిసి ఇంటి ముందు కూర్చుని ఉండగా పక్కింట్లో ఉండే ఎరుపుల మధు అనే వ్యక్తి ముకేందర్​పై గొడ్డలితో దాడి చేశాడు.

అడ్డు వచ్చిన ముకేందర్​ తల్లి సావిత్రిపై కూడా దాడి చేశాడు. గొడవ పెద్దది కావడంతో చుట్టు పక్కల వారు వచ్చి ముకేందర్​, సావిత్రిలను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ముకేందర్​ మృతి చెందాడు. సావిత్రి పరిస్థితి విషమంగా ఉందని సీఐ నవీన్​ తెలిపారు. రెండు కుటుంబాల మధ్య తాతల కాలం నుంచి వైరం ఉందని, తరచూ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతుండేవని, దాడి సమయంలో మధు గంజాయి సేవించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మధు మొదటి నుంచీ నేర ప్రవృత్తి కలవాడని, గతంలోనూ చోరీ కేసులో జైలు శిక్ష అనుభవించినట్టు సీఐ తెలిపారు.

Advertisement

Next Story