గ్యాంగ్​ లీడర్​ కావాలనే హత్య

by Sridhar Babu |
గ్యాంగ్​ లీడర్​ కావాలనే హత్య
X

దిశ, బడంగ్ పేట్​ : సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్​ విద్యార్థి హత్య కేసులో బాలాపూర్​ పోలీసుల విచారణలో ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ వ్యవహారంతో పాటు తరచూ జరుగుతున్న గొడవల కారణంగానే ఇంజనీరింగ్​ విద్యార్థిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రశాంత్​ హత్య కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వివరాలలోకి వెళితే .... ఖమ్మం జిల్లా అయ్యవారి గూడెంకు చెందిన టి.అనిత, శాంతయ్య ల కుమారుడు ప్రశాంత్​ (21) గత కొంత కాలం క్రితం తన తల్లి అనిత తో కలిసి బాలాపూర్​లో నివసిస్తున్నాడు. ప్రశాంత్​ నాదర్​గూల్​ ఎంవీఎస్సార్​ ఇంజనీరింగ్​ కళాశాలలో బీఈ సివిల్స్​ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

ఇది ఇలా ఉండగా మహేష్​ ​యాదవ్​ కూడా గత కొంత కాలం క్రితం తన తల్లితో కలిసి ఉప్పల్​ నుంచి బాలాపూర్​లోని తన తాత ఇంట్లోనే ఉంటున్నారు. అయితే స్థానికంగా ఉండే మహేష్​ యాదవ్​తో ప్రశాంత్ కు పరిచయం ఏర్పడింది. మహేష్​ యాదవ్​ స్నేహితులతో కలిసి ప్రశాంత్​ కూడా సన్నిహితంగానే ఉన్నట్లు సమాచారం. మహేష్​ యాదవ్​కు గ్యాంగ్​ లీడర్​ కావాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున గ్యాంగ్​లను మెయింటెన్​ చేసేవాడు. అయితే మహేష్​యాదవ్​కు ప్రశాంత్​ల మధ్య గత రెండు మూడు నెలలుగా చిన్న చిన్న గొడవలు జరిగినట్లు సమచారం. అంతేగాకుండా ప్రేమ వ్యవహారంలో కూడా వీరి మధ్య గొడవలు జరగినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో తనను అందరూ గుర్తు పట్టేలా ఏదో ఒకటి చేయాలన్న ఆకాంక్ష కూడా మహేష్​ యాదవ్​ కు బలంగా ఉండడంతో తరచూ గొడవలు, ప్రేమ వ్యవహారం కారణంగా ప్రశాంత్​ పై కక్ష పెంచుకున్నాడు.

ఈ నెల 22వ తేదీన గురువారం మధ్యాహ్నమే బాలాపూర్​లో మహేష్ యాదవ్​ తన స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మహేష్​యాదవ్​ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ బైక్​పై ముందస్తుగా బాలాపూర్​ గణేష్​ చౌక్​ సమీపంలో 37 మండి అరేబియన్​ బిర్యాని సెంటర్​ లోని పాన్​ షాప్​ వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రశాంత్ బైక్​పై గణేష్​ చౌక్​ నుంచి బాలాపూర్​లోని తన ఇంటికి వెళ్తున్నాడు. గమనించిన మహేష్​యాదవ్​ ప్రశాంత్​ కు ఫోన్​ చేసి బిర్యాని సెంటర్​కు రావాలని చెప్పాడు. దీంతో అప్పటికే పాల ప్యాకెట్​, బ్రెడ్​ తీసుకుని ఇంటికి వెళ్తున్న ప్రశాంత్​ తిరిగి బిర్యాని సెంటర్​కు చేరుకున్నాడు. పాన్​ షాప్​ వద్ద సిగరెట్లు తాగుతుండగా మహేష్​యాదవ్​, ప్రశాంత్​ ల మధ్య మరో మారు వివాదం తలెత్తింది. క్షణికావేశంలో ప్రశాంత్​ను కేక్​ను కట్​ చేసే కత్తితో హతమార్చి, తన ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్​ పై పరారైనట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం. ఇంజనీరింగ్​ విద్యార్థి హత్య కేసులో ముగ్గురే ఉన్నారా? మరో నలుగురు సహకరించారా? అన్నది తేలాల్సి ఉంది. ప్రశాంత్​ది క్షణికావేశంలో చేసిన హత్యనా? ముందస్తు స్కెచ్​ ప్రకారం చేసిన హత్యనా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఈ కేసును బాలాపూర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed