నిజామాబాద్ లో హైటెక్ వ్యభిచారం

by Sridhar Babu |
నిజామాబాద్ లో హైటెక్ వ్యభిచారం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో హైటెక్ వ్యభిచారం వెలుగు చూసింది. డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవ నగర్ సమీపంలోని హైదరాబాద్ రూట్ లో ఉన్న ఓ హోటల్ లో వ్యభిచారం కొనసాగుతోందని పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు హోటల్ పై ఆకస్మిక దాడి నిర్వహించారు. పోలీస్ రైడ్ లో వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన 8 మంది విటులను, ఐదుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్టార్ హోటల్లో రిచ్ గా సాగుతున్న ఈ వ్యభిచార బాగోతాన్ని పోలీసులు బట్టబయలు చేయడంతో కొంతకాలంగా నిజామాబాద్ లో హైటెక్ వ్యభిచారం కొనసాగుతోందనే అనుమానాలు నిజమయ్యాయి. ఎనిమిది మంది విటులను, ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి 13 మొబైల్ ఫోన్లు, రూ.38,760 లు నగదు, కొంత మొత్తంలో నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వ్యభిచారంతో పాటు నకిలీ నోట్ల దందా కూడా...

నిజామాబాద్ లో స్టార్ హోటల్లో బయటపడ్డ హైటెక్ వ్యభిచారం దందాలో ఫేక్ కరెన్సీ లభ్యం కావడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. వ్యభిచారం దందాతో పాటు నకిలీ నోట్ల మార్పిడి దందాను కూడా నిర్వహిస్తున్నారేమోనని అనుమానాలు కలిగిస్తున్నాయి. బయటకు చెప్పకపోయినా తమదైన శైలిలో పోలీసులు విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఫిల్మ్​నగర్ కు చెందిన యువకుడు పోలీసు రైడ్ లో పట్టుబడ్డటం, పట్టుబడ్డ విటుల్లో ఉన్నత వర్గాలకు చెందిన రైతులు, మెడికల్ వ్యాపారులు ఉండటంతో హోటల్లో జరుగుతున్న వ్యభిచారం ఖరీదైనదై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పైగా పట్టుబడ్డ ఎనిమిది మందిలో ఏడుగురు జిల్లా వాస్తవ్యులు కావడం, ఒక్కడు మాత్రం హైదరాబాద్ కు చెందిన వ్యక్తి కావడంతో జూనియర్ ఆర్టిస్టులను ఇక్కడికి తెచ్చి వ్యభిచారం కొనసాగిస్తున్నాడనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి జిల్లా కేంద్రంగా జరుగుతున్న వ్యభిచారం దందాపై కొద్దిరోజుల క్రితం దిశ పత్రికలో దాదాపు 7 రోజులపాటు వరుస కథనాలు ప్రచురితం కాగా, కామారెడ్డిలో పెద్ద మొత్తంలో జరుగుతున్న వ్యభిచారం దందాను దిశ పత్రిక ఎక్స్ క్లూజివ్ గా వెలుగులోకి తీసుకొచ్చింది. తాజాగా నిజామాబాద్ లో స్టార్ హోటల్లో బయటపడ్డ వ్యభిచారం దందాతో పాటు నకిలీ కరెన్సీ నోట్ల వ్యవహారం కూడా చర్చనీయాంశం అయింది. పోలీసులకు తీగ దొరకడంతో డొంక లాగే పనిలో పడ్డారు. కరెన్సీ నోట్ల కథ కమామీషు ఏమిటన్నది పోలీసులు బయటపెడితే తప్ప నిజాలు తెలిసే అవకాశాలు లేవు.

Advertisement

Next Story

Most Viewed