Arrest : పాఠశాలలో బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ఐదుగురు అరెస్ట్

by Aamani |
Arrest : పాఠశాలలో బెదిరించి  డబ్బులు డిమాండ్ చేసిన ఐదుగురు అరెస్ట్
X

దిశ,రాజేంద్రనగర్ : తెలంగాణ లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులం అంటూ ఈనెల 18వ తేదీన కాటేదాన్ ఆదిత్య టాలెంట్ స్కూల్ లో నానా హంగామా సృష్టించి ఉపాధ్యాయులతో పాటు నిర్వాహకులను భయభ్రాంతులకు గురిచేసిన ఐదుగురిని మైలార్ దేవ్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపిన కథనం ప్రకారం... కాటేదాన్ వెంకటేశ్వర కాలనీ లో ఉన్న ఆదిత్య టాలెంట్ హై స్కూల్ కు ఈ నెల 18న కొంతమంది విద్యార్థి సంఘం నాయకులం అంటూ వచ్చి నానా హంగామా సృష్టించారు. స్కూల్ యాజమాన్యాన్ని బుక్స్ అమ్ముతున్నారు, ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నారు. మీ టర్నోవర్ ఎక్కువ ఉందని రూ. 3 లక్షలు డిమాండ్ చేశారు. దాదాపు రెండు మూడు గంటల పాటు విద్యార్థులను, ఉపాధ్యాయులను, యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య సంఘం తరపున పలువురు పాఠశాలల కరస్పాండెంట్లు హుటాహుటిన అక్కడికి చేరుకోగా నిందితులు పారిపోయారు. పాఠశాల యాజమాన్యంతో పాటు వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు అదే రోజు మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ సత్యకుమార్ దర్యాప్తు చేపట్టి బెదిరింపులకు గురి చేసి డబ్బు డిమాండ్ చేసిన 13 మందిలో ఐదు మందిని సోమవారం గుర్తించి అరెస్టు చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో తెలంగాణ లీగల్ స్టూడెంట్ అసోసియేషన్ చైర్మన్ కార్తీక్ అలియాస్ బాలకోటి, సందీప్, లక్ష్మీకాంత్ చారి, ప్రవీణ్ యాదవ్, ప్రణయ్ గౌడ్ తదితరులు ఉన్నారు. వీరితోపాటు పరారీలో ఉన్న మరో ఎనిమిది మందిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని ఇన్స్పెక్టర్ వెల్లడించారు. ఎవరైనా స్టూడెంట్స్ నాయకులమంటూ పాఠశాలలకు వచ్చి బెదిరిస్తే వెంటనే 100 కు డయల్ చేయాలని ఆయన సూచించారు. ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed