ఆస్తి కోసం అన్నదమ్ములు ఫైట్​

by Sridhar Babu |
ఆస్తి కోసం అన్నదమ్ములు ఫైట్​
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆస్తి తగాదాలు, భూతగాదాలు మనుషుల మధ్య బంధాలను, అనుబంధాలను తెంచేస్తున్నాయి. దగ్గరగా ఉండాల్సిన అన్న దమ్ములను, ఆత్మీయులను దూరం చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఇద్దరన్నదమ్ముల మధ్య నలుగుతున్న భూ వివాదం విచక్షణా రహితంగా కొట్టుకునేదాక వెళ్లింది. ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు, వారి పిల్లలు వారసత్వంగా వచ్చే ఆస్తి కోసం కొట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..

మంగలి శంకర్, మాధవ్ లు ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరి కన్నా చిన్నవాడు తమ్ముడు ఉండే వాడు. ఆయన చాలా కాలం కిందటే పెళ్లి కాక ముందే చనిపోయాడు. దాంతో తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తికి ఇద్దరే వారసులుగా మిగిలారు. కాగా చనిపోయిన చిన్న తమ్ముడి భాగం ఆస్తి తనకే చెందాలని, ఆస్తిని మూడు భాగాలు చేసి రెండు భాగాలు తనకు ఇవ్వాలని శంకర్ పట్టు పడుతున్నాడని మాధవ్ కొడుకు రాము తెలిపాడు. ఇటీవలే శంకర్, మాధవ్ ల తల్లి చనిపోగా బుధవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులు అంతా కలిసి ఆమె అంత్య క్రియల ఖర్చులు, ఇతర ఆస్తుల విషయమై మాట్లాడుతుండగా అన్న దమ్ముల మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది.

ఇద్దరన్నదమ్ములు చేతికేది అందితే దాంతో కొట్టుకున్నారు. వారి పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు అందరూ ఒకరిపై ఒకరు దాడికి దిగారు. దాడిలో శంకర్, ఆయన పిల్లలు బాబులాల్, సుధాకర్, గంగమణిల దాడిలో మాధవ్, అతని భార్య నాగవ్వలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో మాధవ్ కొడుకు రాము భయపడి పారిపోయాడు. గొడవలో కుటుంబ సభ్యుల అరుపులు విని చుట్టుపక్కల వారు నిద్ర లేచి ఇద్దరినీ సముదాయించే ప్రయత్నం చేశారు.

ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు కుటుంబాల సభ్యులను బెదిరించి గొడవను సద్దుమణిగగేలా చేశారు. అప్పటికే ఇరు కుటుంబాల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మాధవ్, నాగయ్య దంపతులను చికిత్స కోసం హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జీజీహెచ్ లో క్షతగాత్రులకు చికిత్స జరుగుతోంది. వీరి ఘర్షణ తాలూకు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed