దేశవ్యాప్తంగా ఒకేరోజు 8392 కరోనా కేసులు

by vinod kumar |   ( Updated:2020-06-01 10:45:41.0  )
దేశవ్యాప్తంగా ఒకేరోజు 8392 కరోనా కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో : దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ బుల్లెటిన్ విడుదల చేసేటప్పటికి గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8392 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,90,535కి చేరింది. సోమవారం కరోనాతో 230 మంది చనిపోగా.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5394 మంది మరణించారు. అంతేకాకుండా.. కరోనా కేసుల్లో దేశం ప్రపంచంలోనే 7వ స్థానానికి చేరుకుంది. ఫ్రాన్స్, జర్మనీలను దాటేసింది. ప్రపంచంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో ఇటలీ 6వ స్థానంలో ఉండగా భారత్ తర్వాత 8వ స్థానంలో ఫ్రాన్స్ ఉంది.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి 91,819 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంకా.. 93,322 మంది ప్రస్తుతం వ్యాధితో పోరాడుతున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా ఉగ్ర రూపం దాలుస్తోంది. మహారాష్ట్రలో ఈ రోజు 2361 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రికార్డైన కేసులతో కలిపి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 70,013కి చేరింది. రాష్ట్రంలో గడిచిన 16 రోజులుగా 2వేలకు పైనే కొత్త కేసులు రికార్డవుతున్నాయి. అంతేకాకుండా.. 76 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 2362కి చేరింది. రాజధాని ముంబైలోని ధారావి మురికివాడలో ఒక్కరోజే 34 కేసులు నమోదుకాగా ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 1805కి చేరింది.

తమిళనాడులో సోమవారం 1162 కొత్త కేసులు నమోదవడంతో కేసుల సంఖ్య 23495కి చేరింది. 11 మంది మరణించారు. దీంతో వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 184కి చేరింది. రాజధాని చెన్నైలో మొత్తం కేసుల సంఖ్య 15770కి చేరింది. అటు దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే 990 కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 20,834కు వెళ్లింది. ఇక్కడ కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 523గా ఉంది.

గుజరాత్‌లో ఒక్కరోజే 423 కొత్త కేసులు నమోదవగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17,217కి చేరింది. గడిచిన 24 గంటల్లో 25 మంది కరోనాతో చనిపోవడంతో ఇప్పటివరకు ఇక్కడ వ్యాధి సోకి మరణించిన వారి సంఖ్య 1063కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే కొత్తగా 105 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 3676కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 885 యాక్టివ్ కేసులున్నాయి.

Advertisement

Next Story

Most Viewed