వారం రోజుల్లో.. 22 మరణాలు

by vinod kumar |
వారం రోజుల్లో.. 22 మరణాలు
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో కరోనా వైరస్ విళయతాండవం చేస్తోంది. వారం రోజుల్లో కొత్తగా 328 కొత్త కేసులు నమోదు కాగా.. 22 మంది ఈ వైరస్ మూలంగా మరణించారు. నమోదవుతున్న కేసుల్లో.. విదేశాల నుంచి వస్తున్న వారిలో, ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి చేరుకుంటున్నవారిలోనే అధికంగా ఉంటుండటం గమనార్హం.. మే 18 నుంచి 25 వరకూ 328 కరోనా కేసులు నమోదయ్యాయి. 170 మంది అంతరాష్ట్ర వలసదారుల్లో నమోదవ్వగా.. విదేశాల నుంచి వచ్చిన 32 మంది ఉన్నారు. మొత్తం కేసుల్లో ఇవి సగానికి పైగానే ఉన్నాయి. ఈ నెల 18న రాష్ట్రంలో 1,592 కేసులుండగా.. సోమవారం నాటికి 1,920కి చేరుకున్నాయి.
రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం..సోమవారం 66 కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 31, రంగారెడ్డిలో ఒకటి నమోదయ్యాయి. మిగిలిన 35 కేసులకు వలసలతో సంబంధం ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 18 మందికి, వలస కూలీల్లో 15 మందికి, మహారాష్ట్రకు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక సోమవారం 72 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కరోనా చికిత్స అనంతరం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,164కు చేరుకుంది. ఏడొందల కేసులకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

56కు చేరిన కరోనా మరణాలు

రాష్ట్రంలో కరోనా మరణాలు 56కు చేరుకున్నారు. ఈ నెల 19 నుంచి 25 వరకూ వారం రోజుల్లోనే 22 మరణాలు నమోదవడం గమనార్హం.. మొత్తం కరోనా మరణాల్లో సుమారు సగం వరకూ ఈ వారం రోజుల్లోనే నమోదయినట్టు ఆరోగ్య శాఖ గణంకాలు చెబుతున్నారు. 19న నాలుగు, 20వ తేదీ రెండు, 21న ఐదు, 22న మూడు, 23న ఒకటి, 24న నాలుగు, 25న ముగ్గురు కరోనా మృతిచెందినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. వలస కార్మికులతో పాటు విదేశాల నుంచి వస్తున్నవారిలో కరోనా పాజిటివ్ నమోదవుతుండటంతో పాటు మరణాల సంఖ్య పెరుగుతుండటం రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తోంది. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ఇక్కడికి వస్తున్నవారిలోనే రోజువారీ కేసుల్లో దాదాపు సగం నమోదవుతుండటం కరోనా తీవ్రతకు అద్ధం పడుతోంది. పూర్తిస్థాయిలో విమానాలు, రైళ్లు, బస్సులతో వారందరినీ తీసుకొస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Next Story