దేశవ్యాప్తంగా 24గంటల్లో 6,088 కేసులు

by vinod kumar |   ( Updated:2020-05-23 06:36:31.0  )
దేశవ్యాప్తంగా 24గంటల్లో 6,088 కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రోజుకు 5 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా.. ఈ సంఖ్య ఒక్కసారిగా 6వేలకు చేరింది. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 6,088 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,18,447కి చేరింది. తాజాగా 148 మంది కరోనాతో మరణించడంతో ఈ సంఖ్య 3,583కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 48,534 మంది కోలుకోగా ప్రస్తుతం యాక్టివ్ కేసులు 66,330 ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. మహారాష్ట్రలో శుక్రవారం ఒక్కరోజే 2,940 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్కడ ఒక్కరోజులోనే అత్యధిక కేసులు నమోదైనట్లయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,582కి చేరింది. రాష్ట్రంలో గడిచిన 6 రోజులుగా 2వేలకు పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాజధాని ముంబైలోని ధారావి మురికివాడలో కొత్తగా 53 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1478కి చేరింది. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ మురికి‌వాడలో కరోనా కారణంగా ఇప్పటివరకు 57 మంది ప్రాణాలు కోల్పోయారు.

తమిళనాడు

తమిళనాడులో కరోనా శర‌వేగంగా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో ఒక్కరోజే 786 కొత్త కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 14753కి చేరింది. కరోనాతో ఒక్కరోజే నలుగురు మరణించడంతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 98కు చేరింది. తమిళనాడులో ఇప్పటివరకు 7,128 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. గుజరాత్‌లో ఒక్కరోజే 363 కొత్త కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య13273కి చేరింది. ఇప్పటివరకు ఇక్కడ ఈ వైరస్ సోకి మొత్తం 802 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే 660 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో ఒక్కరోజులో రికార్డైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 11,659 చేరింది. ఇప్పటివరకు కరోనాతో ఢిల్లీలో 208 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఒక్కరోజే కొత్తగా 62 పాజిటివ్‌లు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 2,514కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 728 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కరోనాతో కొత్తగా ఒకరు మరణించడంతో ఈ సంఖ్య 55కు చేరింది.

Advertisement

Next Story

Most Viewed