పాములు పట్టడంలో ఆరితేరిన ‘విద్య’

by Shyam |
పాములు పట్టడంలో ఆరితేరిన ‘విద్య’
X

పాములను పూజించే మనమే.. అవి మన పరిసరాల్లోకి వస్తే.. ఎక్కడ కాటేస్తాయనే భయంతో చంపేస్తాం. కానీ, కేరళలోని కొచ్చికి చెందిన పర్యావరణ ప్రేమికురాలు విద్యారాజు మాత్రం పాముల్ని ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఆప్యాయంగా వాటిని నిమురుతుంది. పాముల్ని చంపొద్దంటూ… అవి మన పర్యావరణానికి మేలు చేస్తాయని, వాటి వల్ల ఎలాంటి ప్రమాదం మనకు ఉండదని ప్రజలకు పాముల గురించి అవగాహన కల్పిస్తుంది. పాముల్ని కాపాడాలని, అవి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయని ఆమె చెబుతోంది. ఇప్పటివరకు 1000కి పైగా పాముల్ని కాపాడిన విద్యారాజు పాములు, పర్యావరణం గురించి తన మనసులోని మాటలను ఇలా చెప్పుకొచ్చారు.
బీహర్లో పుట్టిన విద్యారాజు ప్రకృతి ప్రేమికురాలు. తన భర్త ఎన్వీఎస్ రాజుతో కలిసి ప్రస్తుతం కొచ్చిలో ఉంటోంది. కొచ్చి నేచురల్ హిస్టరీ సొసైటీలో విద్య వలంటీర్‌.
రెండు దశాబ్దాల నుంచి ఆమె పర్యావరణ సంరక్షురాలిగా తన సేవలను కొనసాగిస్తోంది. ఇప్పటికే కొన్ని వందల సంఖ్యలో పాములు, పక్షులు, జంతువులను కాపాడింది. తన భర్త ఉద్యోగరీత్యా గోవాకు బదిలీ కావడంతో, 2002లో విద్య కూడా అక్కడికి వెళ్లింది. గోవాలో ఉన్న వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF)లో వలంటీర్‌గా చేసే విద్యకు.. అక్కడ ఒకావిడతో పరిచయం ఏర్పడింది. ఆమె.. విద్యతో తరుచుగా ‘‘రెపిటైల్స్ రెస్క్యూ ఆపరేషన్’’ గురించి మాట్లాడటంతో విద్యకు కూడా ‘‘రెపిటైల్స్ రెస్క్కూ’’పై ఆసక్తి పెరిగింది. దాంతో తను కూడా రెస్క్కూ ఆపరేషన్‌కు వెళ్లడం ప్రారంభించింది. 2002లో తొలిసారి రక్తపింజరను.. ఏ భయం లేకుండా.. తన చేతుల్లోకి తీసుకున్నానని, ఎంతో అద్భుతమైన ఆ ఫీలింగ్‌ను మాటల్లో చెప్పలేకపోతున్నానని నవ్వుతూ చెబుతోంది విద్య. విషపూరిత, విషరహిత పాములన్నింటిపై అవగాహన ఉందని, ఈ భూమిపై కొన్ని వేల సంఖ్యలో పాములున్నాయని, వాటిని గురించి నిరంతరం నేర్చుకుంటూ ఉండాలని, వాటిని పట్టుకోవడంలో ఓ ట్రిక్ ఉంటుందన్నారు. పాములను పట్టుకునే ముందు తల పట్టుకోవాలా, తోక పట్టుకోవాలా అనేది పాము రకాన్ని బట్టి ఆధారపడుతుందన్నారు. పామును పట్టుకునేటప్పుడు ఆందోళన పడకుండా, ప్రశాంతంగా ఉండాలని, మనం భయపడితే పాములు పసిగట్టి అలర్ట్ అవుతాయని ఆమె అంటున్నారు. 2018 కేరళలో వరదలు వచ్చినప్పుడు.. రెపిటైల్స్ రెస్క్యూ ఆపరేషన్లొ విద్య కీలకపాత్ర పోషించింది. ఆ సమయంలో ఎంతోమంది ఇళ్లలోకి పాములు రావడంతో తరచూ తనకు ఫోన్లు వచ్చేవని, అలా ఎంతోమంది ప్రాణాలు సేవ్ చేశానని ఆమె అంటున్నారు. పని చేయడానికి జెండర్, ఏజ్ ముఖ్యం కాదని ఆమె అంటోంది. పిల్లలకు తప్పనిసరిగా జంతువులు, పక్షులు గురించి అవగాహన కల్పించాలని, వాటితో ప్రేమగా ఉండాలని ఆమె చెబుతోంది. ఇంట్లో, క్లాసులో కూర్చుంటే ప్రకృతిపై అవగాహన రాదని, పిల్లల్ని వీలైనంతగా పరిసరాలతో కనెక్ట్ చేయాలని, చుట్టుపక్కలున్న జంతువులతో అనుబంధాన్ని పెంపొందించాలని విద్య అంటున్నారు. మనకు ఆహారం ఎక్కడ నుంచి వస్తుందో పిల్లలకు తెలియజేయాలని, అప్పుడే ఆహారం విలువ వారికి తెలిసి వస్తుందని, తోటపనిలో పిల్లల్ని భాగం చేయాలన్నారు. ఎవ్వరైనా, ఏదైనా నేర్చుకోవాలంటే ప్రత్యక్షంగా చేస్తేనే తెలుస్తుందని, అనుభవంలోకి వస్తే అన్ని విషయాలు వారికి అర్థమవుతాయని ఆమె అంటోంది. అంతేకానీ టీవీ చూడటం వల్లనో, యూ ట్యూబు వీడియోలు చూసి నేర్చుకోవడం వల్లనో, లేదా చదవడం వల్లనో సరైన అవగాహన రాదన్నారు. పక్షుల్లో కొన్ని వందల, వేల రకాలున్నాయని, పిల్లలకు వాటి గురించి చెబుతుంటే.. తెలియకుండానే పక్షులతో వారికో బాండింగ్ ఏర్పడుతుందన్నారు. అంతేకాదు వాటిని గుర్తుపడతారు, వాటి గురించి ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఏయే పక్షులు ఎలాంటి ధ్వనులు చేస్తాయని కూడా వారికి తెలుస్తుంది. ఈ ప్రకృతికి మానవాళి ఎంత అవసరమో.. జీవజాలం కూడా అంతే అవసరం. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకూడదంటే.. పక్షులను, జంతువులను కాపాడుకోవాలని విద్య అంటున్నారు.

Tags: snake, vidyaraj, kochi, reptile rescue, birds, animals

Advertisement

Next Story