- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత్-చైనా ఘర్షణలపై అమెరికా నిఘా
వాషింగ్టన్/బీజింగ్/న్యూఢిల్లీ: తూర్పు లడాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద జరిగిన ఈ హింసాత్మక ఘటనలో ఒక ఆర్మీ అధికారి సహా 19 మంది భారతీయ సైనికులు మరణించారు. ఇదే సమయంలో చైనా వైపు జరిగిన ప్రాణ నష్టం గురించి లెక్కలు బయటకు రావడం లేదు. పలు జాతీయ వార్తా సంస్థలు మృతులు, క్షతగాత్రులు కలిపి 43మంది అని చెబుతున్నా దానికి బలమైన సాక్ష్యాలు మాత్రం లేవు. చైనా కూడా దీనిపై నోరు మెదపడం లేదు. భారత సైన్యం మాత్రం తమ వైపు 20మంది సైనికులు అమరులైనట్టు అధికారికంగా ధృవీకరించింది.
మృతుల సంఖ్యపై గందరగోళం
గాల్వన్ లోయ ఘటనలో 20 మంది భారత సైనికులు మృతి చెందినట్లు మొదటిగా పీటీఐ రిపోర్ట్ చేసింది. ఆ తర్వాత అరగంటకు 43 మంది చైనా సైనికులు మృతి చెందినట్లు డీడీ న్యూస్ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఇక వెంటనే జాతీయ, ప్రాంతీయ మీడియా కూడా 43 మంది చైనా సైనికులు మృతి చెందారని వార్తలు వెలువరించాయి. అయితే, అసలు ఈ విషయం చెప్పింది ఎవరనే విషయం మాత్రం తెలియరాలేదు. చివరకు ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఒక ట్వీట్ చేస్తూ.. చైనా ఇంటర్‌సెప్ట్స్‌ను అనుసరించి ఏఎన్ఐ 43 మంది చైనా సైనికులు ఘర్షణల్లో మృతి చెందినట్లు తెలిపిందనీ, కానీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదని అని ట్వీట్ చేశారు. ‘చైనా ఆకస్మిక దాడి చేసిన మాట నిజమే. ఈ దాడిలో 20మంది భారత సైనికులు అమరులైన విషయం వాస్తవమే. మన సైనికులు తీవ్రంగా ప్రతిఘటించింది కూడా నిజమేన’ని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, మృతుల సంఖ్యపై ఏఎన్ఐ ఎడిటర్ ఇషాన్ ప్రకాష్ ట్వీ చేస్తూ.. చైనా సైనికులు 43 మంది మృతిచెందినట్టు చెప్పలేదనీ, మృతులు, క్షతగాత్రులు కలిపి 43 మంది అని మాత్రమే చెప్పామని నిర్ధారించారు. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ కూడా ఒక ట్వీట్ చేస్తూ.. ‘మా సైనికులు ఎంత మంది చనిపోయారో అధికారికంగా ఎవరూ చెప్పలేదు’ అని పేర్కొన్నారు. దీంతో చైనా వైపు ఎంత ప్రాణనష్టం జరిగిందనే విషయంపై ఎవరూ ఒక స్పష్టతకు రాలేకపోతున్నారు.
35 అంటున్న అమెరికా
ఇండో-చైనా ఘర్షణల్లో మృతుల సంఖ్యపై గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో అమెరికా నిఘా వర్గాలు స్పందించాయి. గాల్వన్ లోయ ఘర్షణల్లో 35 మంది చైనా సైనికులు మృతి చెందినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేసినట్లు ఫ్రీప్రెస్ జర్నల్ ఒక కథనంలో తెలిపింది. చైనా కావాలనే మృతుల సంఖ్యను దాచిపెడుతోందని ఆ కథనంలో పేర్కొంది. ఇదే మొదటిసారి కాదని 1962 యుద్ధం నుంచి చైనా ఇదే పంథా అనుసరిస్తోందని చెప్పుకొచ్చింది. దీంతో భారత మీడియా సంస్థలు చెబుతున్న 43 సంఖ్య మృతులు, క్షతగాత్రులు కలిపే అయి ఉండొచ్చని తెలుస్తోంది.
అవమానంతోనే మృతుల సంఖ్య చెప్పడం లేదు: మసాచుసెట్స్ నిపుణుడు
వాస్తవాధీన రేఖ వెంబడి గాల్వన్ లోయలో జరిగిన తీవ్ర హింసాత్మక ఘటనల్లో చైనా సైనికులు భారీగా చనిపోవడాన్ని ఆ దేశ ప్రభుత్వం అవమానంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. కత్తులు, రాళ్లతో మాత్రమే ఈ దాడి జరిగిందనీ, ఆయుధ రహిత ఘర్షణల్లో భారీగా సైన్యాన్ని నష్టపోవడాన్ని బీజింగ్ అవమానంగా భావిస్తూ లెక్కలను బయటకు చెప్పడం లేదని మాసాచుసెట్స్‌కు చెందిన చైనా విభాగం నిపుణుడు ఎం.టేలర్ ఫార్వెల్ తెలిపాడు. 1962 యుద్ధంలో మరణించిన సైనికుల సంఖ్యను దశాబ్దాల తర్వాత చైనా 1994లో ప్రచురించి, తమ అంతర్గత చరిత్రలో ప్రకటించింది. బహుశా గాల్వాన్ లోయ మృతుల సంఖ్యను మరో రెండు మూడు దశాబ్దాల తర్వాత ప్రకటిస్తుందేమోనని ఆయన అభిప్రాయపడ్డారు.
గమనిస్తున్నాం: అమెరికా
భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న తాజా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఈ మేరకు అమెరికా విదేశాంగశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరుదేశాలు ఉద్రిక్తతలను తగ్గించి, విభేదాలు పక్కనబెట్టి, సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికులకు సంతాపం ప్రకటించింది. ఇరుదేశాలు కోరితే శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అమెరికా తప్పకుండా సహకరిస్తుందని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఘర్షణలు పెరిగితే ఇరుదేశాలకే కాకుండా ఇతరులకూ ముప్పేనని అమెరికా చెబుతోంది.