బోత్సవానా ఏనుగుల మృతికి బ్యాక్టిరియానే కారణమా?

by Sujitha Rachapalli |
బోత్సవానా ఏనుగుల మృతికి బ్యాక్టిరియానే కారణమా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్రికా, బోత్సువానాలో జూలైలో దాదాపు 300పైగా ఏనుగులు అంతుచిక్కని కారణంతో మరణించిన విషయం తెలిసిందే. బోత్సువానా డిపార్ట్‌మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ నేషనల్ పార్క్ అధికారులు ఈ విషయాన్ని సీరయస్‌గా తీసుకుని, ఏనుగుల మృతదేహాలకు పరీక్షలు నిర్వహించారు. కానీ, కారణాలు తెలియరాలేదు. ఏనుగుల దంతాలు కూడా మిస్ అవ్వ‌లేదు కాబ‌ట్టి వాటిని వేట‌గాళ్లు చంపలేద‌ని ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు అధికారులు. విషప్రయోగం జరిగిందా అనే కోణంలో ద‌ర్యాప్తు కొనసాగించారు. దీనికి గల కారణాలు తెలుసుకునేందుకు వన్యప్రాణి నిపుణులు ప‌రిశోధ‌న‌లు సాగించారు. ఎట్టకేలకు ఆ మిస్టరీ వీడింది.

ఆఫ్రికాలో ఉన్న ఏనుగుల్లో అధిక‌ భాగం బోత్సువానాలోనే ఉన్నాయి. ఏనుగుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఒకేసారి వందలాది ఏనుగులు చనిపోవడంతో అధికారుల్లో అనుమానాలు రావడంతో పరిశోధన సాగించారు. ఈ పరిశోధనలో నీటిలోని సైనోబాక్టీరియా ఉత్పత్తి చేసే టాక్సిన్‌ వల్లనే ఏనుగులు చనిపోయాయని తేలింది. అక్కడి ఏనుగులు చెరువులోని నీళ్లు తాగడం వల్ల.. అందులోని ‘సైనో బ్యాక్టిరియా న్యూరో టాక్సిన్స్’ వల్లే ఇవి చనిపోయాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

సైనో బాక్టీరియా నీళ్లలోనూ, మట్టిలోనూ ఉంటుంది. ఆ సూక్ష్మ జీవి వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయినా వాతావరణ మార్పుల కారణంగా విషతుల్యం అయ్యాయని సైంటిస్టుల పరిశోధనలో తేలింది. మండు వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రత కారణంగా సూక్ష్మజీవులు విషంగా మారాయని బోత్సవానా వన్యప్రాణి ఉద్యానవనాల డైరెక్టర్ సిరిల్ తెలిపారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే..ఆ ప్రాంతంలో నివసిస్తూ ఆ చెరువులోని నీళ్లు తాగిన మిగతా జంతువులకు మాత్రం ఏమీ కాలేదు. కానీ, ఏనుగులే మృత్యువాతపడ్డాయి. దీనికి గల కారణాలను.. శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు.

సైనోబ్యాక్టీరియా వేడి నీటిలో పెరుగుతుంటాయి. చెరువుల్లో నైట్రోజన్, ఫాస్పరస్ అధికంగా ఉండటంతో వాటి ఆధారంగా వేగంగా తమ సంతతిని పెంచుకుంటూ చెరువు మొత్తం ఆక్రమిస్తుంటాయి. గతంలో అమెరికాలోనూ సైనో బ్యాక్టీరియా వల్ల పశువులు చనిపోయిన సందర్భాలున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సైనో బ్యాక్టీరియా ఉన్న నీటిని తాగడం వల్ల జంతువులకే కాదు మనుషులకు కూడా ముప్పు పొంచి ఉంటుంది. లివర్ కేన్సర్, బ్రెయిన్ డిజార్డర్స్ వస్తుంటాయి. ఏనుగులు మృతికి సైనో బ్యాక్టీరియా కారణమని చెబుతున్నారు. అయితే, మరింత పరిశోధనలు జరగాలని, ఆ ప్రాంత పరిస్థితులు, మట్టి, నీరు, జంతువులపై పరిశోధనలు చేస్తేనే, అసలైన కారణాలు తెలుస్తాయని మరికొందరు శాస్ర్తవేత్తలు అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed