- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో 31 మంది డాక్టర్లకు కరోనా
దిశ, హైదరాబాద్: కరోనా మహమ్మారిపై పోరాడుతున్నవారిలో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు కరోనా బారిన పడుతుండడంతో వారిలో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. వైరస్ ప్రభావం, దాని తీవ్రతపై పూర్తి అవగాహన ఉన్న డాక్టర్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి, వైరస్ సోకిన వారిని రక్షించేందుకు కృషి చేస్తున్న క్రమంలో వారికి కూడా వైరస్ సోకుతుండడంతో వారికేమి చేయాలో పాలుపోవడం లేదు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న 31 మంది డాక్టర్లకు, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్స్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. పరిస్థితిని సమీక్షించేందుకు వైద్యులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
కరోనా వ్యాప్తిలో ప్రభుత్వ ఆస్పత్రులే హాట్ స్పాట్ కేంద్రాలుగా మారుతున్నాయి. డాక్లర్లు, వైద్య సిబ్బందికి వైరస్ సోకుతుండడమే ఇందుకు నిదర్శనం. ఉస్మానియా మెడికల్ కాలేజ్ పరిధిలోని భోదనాస్పత్రులైన పేట్లబుర్జు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌తో పాటు నిమ్స్, గాంధీ ఆస్పత్రులలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది వ్యాధి బారిన పడ్డారు. పేట్లబుర్జు ఆస్పత్రిలోనే 18మంది వైద్యులు కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్ర వైద్య వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. నిమ్స్ కార్డియాలజీ విభాగంలోని ప్రొఫెసర్‌తో పాటు నలుగురు పీజీ రెసిడెంట్ డాక్టర్లు, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్స్, పేట్లబుర్జు ఆసుపత్రిలోని గైనకాలజీ విభాగానికి చెందిన ఇద్దరు రెసిడెంట్ డాక్టర్లు, ఓ ప్రొఫెసర్‌కు వైరస్ సోకింది. ఉస్మానియాలో అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న పీజీ డాక్టర్, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన ఇద్దరు పీజీ రెసిడెంట్స్, నలుగురు హౌస్ సర్జన్లు కరోనా బారిన పడ్డారు.
నిమ్స్ కార్డియాలజీ బ్లాక్ మూసివేత
నిమ్స్ ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యులు కరోనా భారిన పడడంతో ఇక్కడ పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారు. వైరస్ ప్రభావం ఉన్న కార్డియాలజీ బ్లాక్‌ను తాత్కాలికంగా మూసివేశారు. అత్యవసరమైన శస్ర్త చికిత్సలు మాత్రమే చేయాలని, సెలెక్టివ్ ఆపరేషన్లను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్యులు సమావేశం నిర్వహించి కరోనా వ్యాప్తిని అరికట్టడంపై చర్చించడంతో పాటు వారు తీసుకున్న నిర్ణయాల ప్రతిని డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డికి అందజేశారు. వైద్యులు, సిబ్బందికి రక్షణ కల్పించాలని కోరారు.
డీఎంఈ మార్గదర్శకాల జారీ
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని భోదనాస్పత్రులకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి పలు మార్గదర్శకాలు జారీచేశారు.
1. ప్రతీ ఆస్పత్రిలోని వైద్యులతో పాటు ఇతర సిబ్బంది వేర్వేరు విభాగాలుగా పనిచేయాలి.
2. ప్రతి బ్యాచ్‌కు 7 రోజుల పాటు క్వారంటైన్, ఒక బ్యాచ్ ముగిసిన తర్వాత మరో బ్యాచ్ క్వారంటైన్‌కి వెళ్ళాలి.
3. కరోనా విజృంభన నేపథ్యంలో వైద్యులు, సిబ్బందికి సెలవులు రద్దు.
4. డ్యూటీలో ఉన్న వైద్యులకు, వైద్య సిబ్బందికి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్ చేసి కరోనా టెస్టులు చేసి వైద్యం అందించాలి.
5. ప్రతీ ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న అన్ని విభాగాల సిబ్బంది విధిగా వ్యక్తిగత రక్షణ కోసం పీపీఈ కిట్, మాస్కు ధరించాలి.
ఎమ్మెల్యేకూ స్పందించిన గాంధీ ఆసుపత్రి
ధూల్‌పేటకు చెందిన గర్భిణీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారని, కానీ వైద్యం సరైన సమయంలో అందకపోవడంతో ఆమె మృతి చెందిందని, ఈ వివరాలు కనుక్కోడానికి ఫోన్ చేసినా ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించలేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణలు చేశారు. అయితే ఆమెకు వైద్యం సకాలంలోనే అందించామని, చికిత్స ఫలించక మృతి చెందినట్లు సూపరింటెండెంట్ పేర్కొన్నారు. గత నెల 31వ తేదీన ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినా ఆసుపత్రి అధికారులు సమాధానం చెప్పడంలేదని, కష్టకాలంలో సైతం అధికారులు స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అయితే ఇది వివాదాస్పదం కావడంతో ఆసుపత్రి హడావిడిగా ఆమె వివరాలను, అందించిన చికిత్స కేస్ షీట్లను బహిర్గతం చేసింది.