30 మంది సాధువులకు కరోనా.. హాట్‌స్పాట్‌గా మారిన హరిద్వార్

by vinod kumar |
Sadhus At Kumbh Mela
X

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొన్న సాధువులు కరోనా బారిన పడుతున్నారు. గురువారం ఒక్కరోజే 30 మంది సాధువులకు కరోనా పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో ఆలిండియా అఖాడా పరిషత్ నాయకుడు మహంత్ నరేంద్ర గిరి కూడా ఉన్నారు. ఆయన రిషికేశ్ లోని ఎయిమ్స్ లో చేరి చికిత్స పొందుతున్నారు.

కాగా.. ఇటీవలే కరోనా సోకిన మహా నిర్వాణ అఖాడా నాయకుడు స్వామి కపిల్ దేవ్ గురువారం కన్నుమూశారు. సాధువులకు కరోనా సోకడంపై హరిద్వార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్‌కె ఝా మాట్లాడుతూ.. ‘గురువారం 30 మంది సాధువులు కరోనా బారిన పడ్డారు. కేసులు ప్రత్యేకించి ఒక్క అఖాడా గ్రూపునకే పరిమితం కాలేదు. నిరంజిని, జునా వంటి అన్ని గ్రూపులకు విస్తరిస్తున్నాయి’ అని తెలిపారు. కాగా, నిన్న ఒక్కరోజే హరిద్వార్ లో 600కు పైగా పాజిటివ్ కేసులొచ్చాయి. ఇదిలాఉండగా.. కుంభమేళా ప్రారంభమైన ఏప్రిల్ 10 నుంచి నిన్నటి (15 వ తేదీ) వరకు హరిద్వార్ లో 2,167 మందికి కరోనా సోకినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇదిలాఉండగా.. హరిద్వార్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న సాధువులంతా తమ స్వస్థలాలకు వెళ్లాలని నిరంజిని అఖాడా సెక్రెటరీ రవీంద్ర పూరి సాధువులను అభ్యర్థించారు. కుంభమేళాకు వచ్చిన సాధువులంతా గంగలో పుణ్యస్నానం ఆచరించి ఇక్కడ్నుంచి వెళ్లిపోవాలని ఆయన కోరారు. హరిద్వార్ లో 13 అఖాడాలు ఉన్నాయి. ఇక్కడ లక్షలాది మంది సాధువులు ఆశ్రయం పొందుతున్నారు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా కుంభమేళాను కుదించాలని డిమాండ్ వినిపిస్తున్నా స్థానిక బీజేపీ ప్రభుత్వం మాత్రం అందుకు సంసిద్ధంగా లేదని తెలుస్తున్నది.

Advertisement

Next Story