ఇక చాలు.. మహిళలు పనిలోకి రావొద్దు..! ముగ్గురు యువతుల హత్యతో అఫ్ఘాన్ టీవీ ఛానెల్ నిర్ణయం

by vinod kumar |
Afghanistan women journalists killed
X

దిశ, వెబ్‌డెస్క్: దశాబ్దాలుగా తాలిబన్ల చెరలో నలుగుతున్న అఫ్ఘనిస్తాన్‌లో మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం అనేవి గాలిలో దీపం వంటివే. ముస్లిం మహిళలు పరదాలు దాటి బయటకు వచ్చే స్వతంత్ర్యం అక్కడ లేదు. ఇంటినుంచి బయటకు రావొద్దని ఉన్మాదులు చెబుతుండగా.. వారి మాటను ధిక్కరించినందుకు గాను ఈ నెలలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. తమ ఆదేశాలను ఉల్లంఘించి మీడియా రంగం (టెలివిజన్‌లో) పని చేస్తున్నారనే కారణంగా టెర్రరిస్టులు మార్చి 3న ఈ అఘాయిత్యానికి తెగబడ్డారు. దీంతో మహిళలతో పనులు చేయించుకుంటున్న టీవీ ఛానెళ్లు.. మహిళలు ఇక పనిలోకి రావొద్దని, వారిని ఆఫీసు నుంచి తొలగిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

అఫ్ఘనిస్తాన్‌లోని జలాలబాద్‌కు చెందిన ముర్సల్ వహిది, సదియా సదత్, షెహనాజ్ అనే ముగ్గురు యువతులు స్థానికంగా ఉన్న ఎనికాస్ టీవీ స్టేషన్‌లో పని చేస్తున్నారు. వీరి వయసు 18-20 ఏళ్ల మధ్య ఉంది. ఇటీవలే ఉన్నత విద్య పూర్తి చేసుకుని తమ దేశంలో మహిళలపై జరుగుతున్న అరాచకాల మీద నినదిద్దామని మీడియా రంగంలోకి ప్రవేశించారు. అయితే ఇది తాలిబన్లకు నచ్చలేదు. తమ మాట ధిక్కరించినందుకు గాను వారిని చంపడానికి ప్రణాళికలు వేశారు.

ఈనెల 3న ఆఫీసు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, ముర్సల్, సదియా, షెహనాజ్‌లపై తాలిబన్‌ గ్రూపునకు చెందిన ఒక ముష్కరుడు వారిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఆ ముగ్గురు యువతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. గతేడాది డిసెంబర్‌లో కూడా అఫ్ఘాన్‌లో ఎనికాస్ టీవీకి చెందిన ఒక న్యూస్ ప్రెజెంటర్‌ను తాలిబన్లు కాల్చి చంపారు.

కాగా.. తాజా ఘటనల నేపథ్యంలో తమ ఛానెళ్లో పని చేస్తున్న మిగతా మహిళలు ఇక ఆఫీసుకు రావొద్దని సదరు టీవీ ఛానెల్ ఆదేశించింది. ఈ మేరకు ఎనికాస్ టీవీ ఛానెల్ హెడ్ జల్మాయ్ లతిఫి ‘తాలిబన్లు ఈ దారుణాలు ఎందుకు పాల్పడుతున్నారో తెలియదు. మీడియాలో పనిచేస్తున్నారనే కారణంతో మహిళలను చంపడం దారుణ చర్య. మా సంస్థలో పదిమంది మహిళలు పనిచేస్తున్నారు. వారిలో ముగ్గురిని చంపేశారు. తాజా హత్యల నేపథ్యంలో మిగిలిన వారిని పనికి రావొద్దని సూచించాం..’ అని తెలిపారు. ఎనికాస్‌తో పాటు మరికొన్ని టీవీ ఛానెళ్లు కూడా మహిళా ఉద్యోగులకు ఇంటికి పంపేస్తున్నాయని తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed