అగర్వాల్ ఐ ఆస్పత్రిపై కేసులు నమోదు

by Sumithra |
అగర్వాల్ ఐ ఆస్పత్రిపై కేసులు నమోదు
X

దిశ, క్రైమ్ బ్యూరో : పంజాగుట్ట అగర్వాల్ ఐ ఆస్పత్రి పై ఒకేరోజు మూడు కేసులు నమోదయ్యాయి. తమ కంటి చూపు పోగొట్టినట్టు ఇద్దరు ఫిర్యాదు చేయగా, ఒకరు తమ బాబు మరణానికి కారణమైన ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్ పల్లి మహాంకాళి నగర్ ఎల్లమ్మబండ ప్రాంతానికి గణపతిరెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి (10) కాటరాక్ట్ చికిత్స నిమిత్తం ఈ నెల 20న పంజాగుట్ట అగర్వాల్ ఆస్పత్రిలో చేరారు.

ఆ రోజు చికిత్స ప్రారంభించే సమయానికి బాలుడు అనారోగ్యంగా ఉన్నందున మెరుగైన చికిత్స నిమిత్తం అదే రోజు మధ్యాహ్నం సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచనల మేరకు బంజారాహిల్స్ రెయిన్ బో చిల్డ్రన్స్ ఆస్పత్రికి సాయంత్రం 5 గంటల సమయంలో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 25 సోమవారం బాలుడు మరణించాడు. దీంతో బాలుడి తల్లి పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాము నాయక్ తెలిపారు.

మెరుగైన చికిత్స కోసం వస్తే..

గాంధీనగర్ బాకారానికి చెందిన పద్మ తన కంటి చికిత్స కోసం హిమాయత్ నగర్ లోని అగర్వాల్ ఐ ఆస్పత్రిలో డాక్టర్ లతను సంప్రదించారు. రెండు కళ్లకు ఆపరేషన్ చేయాలని కోరారు. దీంతో డాక్టర్ సలీమ్ గతేడాది సెప్టెంబరు 26న కుడి కంటికి, సెప్టెంబరు 30 ఎడమ కంటికి శస్త్ర చికిత్సను నిర్వహించారు. ఆపరేషన్ చేసిన మరుసటి రోజు నుంచి ఎడమ కన్ను నొప్పిగా ఉంటూ క్రమేపీ మొత్తం చూపును కోల్పోయింది. ఈ విషయంపై అక్టోబరు 2న ఆస్పత్రిలో డాక్టర్ లతను సంప్రదించగా.. డాక్టర్ సలీమ్ బాధితురాలికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎడమ కంటికి రెండో సారి ఆపరేషన్ చేశారు.

అయినా కూడా ఆమె కంటి చూపు మెరుగు పడకపోగా.. చూపును పూర్తిగా కోల్పోయింది. దీంతో బాధితురాలు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. ఇదిలా ఉండగా… దోమలగూడ బండానగర్ కు చెందిన కళావతి గతేడాది సెప్టెంబరు 30న హిమాయత్ నగర్ లోని అగర్వాల్ ఆస్పత్రిని సంప్రదించగా.. డాక్టర్ లత సూచనల మేరకు డాక్టర్ సలీమ్ ఆపరేషన్ నిర్వహించారు. కాగా ఆపరేషన్ చేసిన తర్వాత ఆమె కూడా కంటిచూపు కోల్పోయారు. దీంతో ఆమె కూడా పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed