రెండో రోజూ ప్రజా రవాణా బంద్

by Shyam |
రెండో రోజూ ప్రజా రవాణా బంద్
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణలో లాక్‌డౌన్ అమలవుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండోరోజు ప్రజారవాణా స్తంభించింది. రాష్ట్రంలో ప్రస్తుత ప్రజా రవాణా పరిస్థితి తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011లో నిర్వహించిన సకల జనుల సమ్మెను తలపిస్తోంది. రాష్ట్రంలో ప్రజా రవాణాకు ఆయువు పట్టుగా ఉంటూ రోజుకు సగటున కోటి మందికి పైగా ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) బస్సులు ఎక్కడికక్కడ డిపోల్లోనే నిలిచిపోయాయి. రాష్ట్రంలో సోమవారం 10 వేల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలోప్రజా రవాణాకు మరో ముఖ్య ఆధారంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అన్ని రైళ్లు నిలిచిపోవడంతో రాష్ట్రంలో రైలు రవాణా కూడా పూర్తిగా నిలిచిపోయింది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రైవేటు ప్రజారవాణా వాహనాలైన ఆటోలు, క్యాబ్‌లు , కాంట్రాక్టు క్యారియర్లు, స్టేజి క్యారియర్లు అన్ని ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరో పక్క ప్రజల వ్యక్తిగత వాహనాలైన టూ వీలర్లు, ఫోర్ వీలర్లు కూడా దాదాపు ఇళ్లకే పరిమితమయ్యాయి. మినహాయింపు ఉన్న రంగాల, పరిమితంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఆరోగ్య సంబంధ అవసరాలున్నవాళ్లు మాత్రమే వాహనాలతో రోడ్ల మీదకు వచ్చారు.

హైదరాబాద్ నగరంలోనూ ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఆర్టీసీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు, క్యాబ్‌లు, ప్రేవేటు కంపెనీల వాహనాలు ఏవీ రోడ్ల మీదకు రాలేదు. ఏదైనా నిబంధనలు ఉల్లంఘించి రోడ్డెక్కిన తాత్కాలిక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గస్తీగా ఉన్న పోలీసులు వాటిని ఆపి సీజ్ చేశారు. అత్యవసర ఆరోగ్య సమస్యలున్న వాళ్లు మాత్రం దానికి సంబంధించిన ఆధారాలు చూపి ఆటోల్లో ప్రయాణాలు కొనసాగించారు. దీంతో నగరంలో రోడ్ల మీద కొద్ది సంఖ్యలో టూ వీలర్లు, కార్లు తప్ప ఏ ప్రజా రవాణాకు సంబంధించిన వాహనం రోడ్డెక్కలేదనే చెప్పాలి. ప్రజలు స్వచ్ఛందంగా తమ ప్రయాణాలు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, లాక్ డౌన్ పొడిగింపు సమాచారం లేని కొందరు ప్రయాణికులు నగరంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడున్న పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో కొంత సేపు వేచి చూసి వెనుదిరిగి వెళ్లిపోయారు.

Tags: corona lockdown, public transport halted, telangana

Advertisement

Next Story