సెకండ్ డే సీరియస్‌గా లాక్‌డౌన్

by Shyam |   ( Updated:2020-03-24 08:43:05.0  )
సెకండ్ డే సీరియస్‌గా లాక్‌డౌన్
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వ్యాప్తి నిరోధించడానికి తెలంగాణలో చేపట్టిన లాక్‌డౌన్ రెండోరోజుకు చేరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చిన మేరకు ముందు 24 గంటల స్వచ్ఛంద జనతా కర్ఫ్యూ పేరుతో రాష్ట్రంలో సోషల్ డిస్టెన్సింగ్ పూర్తిస్థాయిలో స్టార్టైంది. అదే రోజు జనతాకర్ఫ్యూపై సమీక్ష జరిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కర్ఫ్యూను మార్చి 31 దాకా పొడిగిస్తూ లాక్ డౌన్ ప్రకటించారు. దీనివల్ల ఉపాధి కోల్పోనున్న తెల్లరేషన్ కార్డున్న వారందరికీ 12 కేజీల బియ్యంతోపాటు రూ.1,500 నగదు ఇస్తామని తెలిపారు. ఎపిడమిక్ యాక్ట్ 1897 కింద లాక్‌డౌన్ నోటిఫై చేస్తూ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ అదేరోజు జీవో నెం.45 ఇచ్చింది. కొన్ని అత్యవసర సర్వీసులు తప్ప అన్నిరకాల సేవలు, కార్యాలయాలు, వ్యాపారాలు మూతపడతాయని ఈ జీవోలో తెలిపింది. ఆదివారం స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొన్న ప్రజలు అధికారిక లాక్‌డౌన్ మొదటి రోజైన సోమవారం మాత్రం ఇళ్లలో నుంచి పెద్ద సంఖ్యలో బయటికి వచ్చారు. వీరిలో చాలామంది అత్యవసర పనులు లేకపోయినా తమ రోజవారీ కార్యాలయాలకు వెళ్లడానికి, సొంత వ్యాపారాలు నడిపించుకోడానికి ప్రయత్నించారు. ప్రజారవాణాలో భాగమైన ఆర్టీసీ బస్సులు, రైళ్లు, మెట్రో పూర్తిగా ఆగిపోయినప్పటికీ కొన్ని ప్రైవేటు ప్రజా రవాణా వాహనాలు రోడ్ల మీదకు వచ్చి క్యాష్ చేసుకోవాలని చూశాయి. దీంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడి హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పోలీసులను పెద్దసంఖ్యలో రంగంలోకి దింపింది. ఇళ్లలో నుంచి బయటికి వచ్చిన ప్రజలను ఎక్కడికక్కడ తనిఖీలు చేసి సరైన కారణం లేని వాళ్లను వెనక్కి పంపించారు. ప్రైవేటు ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను అడ్డుకొని వందల సంఖ్యలో సీజ్ చేశారు.

ఈ పరిణామంతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్(సీఎస్), డీజీపీ మహేందర్‌రెడ్డి అప్పటికప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సరైన కారణం లేకుండా ఎవరైనా బయటికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలను స్వాధీనం చేసుకుంటామని సీఎస్, డీజీపీ కఠినస్వరంతో హెచ్చరించారు. మరోవైపు లాక్‌డౌన్ నిబంధనలను కఠినతరం చేస్తూ ప్రభుత్వం సోమవారమే మరో జీవో(నెం.46) ఇచ్చింది. ఈ జీవో 46 ప్రకారం రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటలదాకా అత్యవసర ఆస్పత్రి అవసరమున్నవాళ్లు తప్ప ఎవరూ బయటికి రావడానికి అనుమతిలేదని ఆదేశాలిచ్చింది. టూ వీలర్‌పై ఒక్కరికే అనుమతి ఉంటుందని తెలిపింది. నిత్యావసరాల కోసం ఇంటి నుంచి 3 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణించేందుకు వీలులేదని తెలిపింది. ఈలోపు పోలీసులు రాష్ట్రమంతటా బయటికి వచ్చిన ప్రజలను అడ్డుకొని వెనక్కి పంపడంతో లాక్‌డౌన్ తీవ్రత అదేరోజు ప్రజలకు అర్థమైంది. ప్రజారవాణా పూర్తిగా బంద్ అవడం, కార్యాలయాలు, వ్యాపారాలు మూతపడడంతో ఎవరికి వారు బయటికి వచ్చినా ఎక్కడా ఏమీ ఉండదని అర్థం చేసుకొని ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. ఇక లాక్‌డౌన్ రెండో రోజైన మంగళవారం ప్రజలు రోడ్ల మీదకు రావడం సోమవారంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. మినహాయింపు ఉన్న రంగాల ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, నిత్యావసర వస్తువులు అవసరమున్నవారు మాత్రమే బయటికి వచ్చారు. మొదటిరోజు పోలీసులు తీసుకున్న చర్యలు రెండోరోజు సత్ఫలితాలను ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతోపాటు మీడియాలో ప్రభుత్వం, అధికార వర్గాలు చేసిన ప్రచారం కూడా పాజిటివ్ రిజల్టిచ్చింది. దీంతో మంగళవారం రాష్ట్రం, హైదరాబాద్‌లో జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. బయటికి వచ్చినవారిలో సరైన కారణాలున్నవారు, మినహాయింపు ఉన్నవారే ఎక్కువగా ఉండడంతో పోలీసులు వారిని తనిఖీ చేసి వారిని పంపించివేశారు.

Tags: corona lockdown, telangana, police control tightened

Advertisement

Next Story