మంత్రి శంకర్ పై 250 కేసులు

by Sumithra |   ( Updated:2020-12-25 10:57:35.0  )
మంత్రి శంకర్ పై 250 కేసులు
X

దిశ, క్రైమ్ బ్యూరో : మంత్రి శంకర్.. ఈ పేరు చెప్పగానే, శంకర్ అనే వ్యక్తి గతంలో మంత్రి కాబోలు సాధారణంగాన అంతా అనుకుంటారు. కానీ, హైదరాబాద్ మహానగరంలో ఇతనొక కరుడుగట్టిన నేరస్తుడు అని తెలియగానే అందరూ షాక్‌కు గురికావాల్సిందే. ఇండ్లల్లో దొంగతనాలు చేయడంలో ఆరితేరిన వ్యక్తి. ఇప్పటి వరకూ 250 దొంగతనాలకు పాల్పడ్డాడు. సుమారు 209 కేసులలో శిక్ష పడటమే కాకుండా, ఇతనిపై పోలీసులు 4 సార్లు పీడీ యాక్ట్ ప్రయోగించారు. అయినా, మంత్రి శంకర్ దొంగతనాలు మానలేదు. అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. ఇప్పుడాయనకు 60 ఏండ్ల వయస్సు. అయినా దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 6 దొంగతనం కేసుల్లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రి శంకర్‌తో పాటు అతని అనుచరులు మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్ రావు, ఇన్ స్పెక్టర్ కె.నాగేశ్వరరావుతో కలిసి నగర సీపీ అంజనీకుమార్ శుక్రవారం వెల్లడించారు.

10 సెకన్లలోనే హౌజ్ లాక్ బ్రేక్ ..
సికింద్రాబాద్ చిలకలగూడ పీఎస్ పరిధిలో నివసించే మంత్రి శంకర్ 7వ తరగతి వరకు చదువుకున్నాడు. వాళ్ల అమ్మతో ఓ వ్యక్తి తరుచూ గొడవపడుతుంటే అతనిపై హత్యాయత్నం చేయబోయాడు. ఈ కేసులో జైలుకెళ్లిన మంత్రి శంకర్, విడుదలైన దగ్గర నుంచి విలాసాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పుడుతున్నాడు. సుమారు 1979 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు చెబుతున్న సమాచారం. రాత్రి పూట మాత్రమే ఇండ్లను ఎంపిక చేసుకుని, లాక్ ఉన్న ఇండ్లనే దొంగతనాలకు ఎంచుకుంటారు. అర్థరాత్రి 1 గంట నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకూ మాత్రమే దొంగతనాలకు పాల్పడతాడు. బంగారం, వెండి, నగదు, ఇతర విలువైన వస్తువులను దొంగతనాలు చేస్తుంటాడు. ఎంతటి పెద్ద లాక్ అయినా కూడా 10 సెకన్ల నుంచి 15 సెకన్లలో లాక్ బ్రేక్ చేయగల దిట్ట మంత్రి శంకర్. అతను ఇప్పటి వరకూ 250 దొంగతనం కేసులకు పాల్పడినట్టు పోలీస్ అధికారులు చెబుతున్నారు. అందులో 209 కేసులకు శిక్ష ఖరారైంది. అయినా, మంత్రి శంకర్ మాత్రం దొంగతనాలు మానేయలేదు. ఇదిలా ఉండగా, మంత్రి శంకర్ పై ఇప్పటి వరకూ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు.

6 కేసుల్లో మరోసారి అరెస్టు
హైదరాబాద్ నగరంలో పేరుమోసిన క్రిమినల్స్‌లలో మంత్రి శంకర్ ఒకరు. పోలీసుల పరిభాషలో సిటీ డోసియర్ క్రిమినల్‌ (సీడీసీ) గా భావించిన చిలకలగూడ పోలీసులు మంత్రి శంకర్‌కు 1120 నెంబరును కేటాయించారు. చర్లపల్లి జైలు నుంచి 2020 డిసెంబరు 4న విడుదల అయ్యాడు. చర్లపల్లి జైలులో మరో ముగ్గురు నిందితులు పరిచయం కావడంతో వారితో ఓ ముఠాగా కలిసి మంత్రి శంకర్ హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలలో మొత్తం 6 దొంగతనాలకు పాల్పడ్డాడు. వీటిలో బేగంపేట పీఎస్ పరిధిలో 2, నల్లకుంట పీఎస్ పరిధిలో 1, కుషాయిగూడ పీఎస్ పరిధిలో 2 కేసులు, వనస్థలిపురం పీఎస్ లో మరో కేసు నమోదయ్యింది. కేసు దర్యాప్తులో భాగంగా బేగంపేట పోలీసులు, నార్త్ జోన్ టాస్క్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో పక్కా సమాచారం మేరకు పోలీసులు మంత్రి శంకర్‌తో పాటు అబ్దుల్ లతీఫ్ ఖాన్, మహమ్మద్ మాజీద్, మహమ్మద్ ఇంతియాజ్ లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Next Story