2400 ఏళ్ల మమ్మీని వాళ్లు కాపాడారు!

by Harish |
2400 ఏళ్ల మమ్మీని వాళ్లు కాపాడారు!
X

దిశ, వెబ్‌డెస్క్: వారం రోజుల నుంచి దేశంలో విపరీతంగా వర్షాలు పడుతుండటంతో.. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో జైపూర్‌లోనూ వరదలు ముంచెత్తడంతో అక్కడి ‘ఆల్బర్ట్ హాల్’ మ్యూజియంలోకి కూడా నీళ్లు చేరాయి. దీంతో మ్యూజియంలోని పురాతన మమ్మీని రక్షించడానికి దాన్ని మరో చోటుకు తరలించారు.

130 సంవత్సరాల కిందట కైరో నుంచి ఓ మమ్మీని జైపూర్‌లోని ‘ఆల్బర్ట్ హాల్’ మ్యూజియానికి తీసుకొచ్చారు. ఇది ‘టుటు’ అనే మహిళది. ఈజిప్టులోని పురాతన నగరమైన పనోపోలిస్ అఖ్మిన్ ప్రాంతంలో కనుగొనబడిన ఈ మమ్మీని.. ఏప్రిల్ 2017లో జైపూర్‌లోని ‘ఆల్బర్ట్ హాల్’ నేలమాళిగకు మార్చారు. దాని చరిత్రతో పాటు డేట్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ డీటెయిల్స్, ఎక్స్‌రే తదితర వివరాలను మ్యూజియంలో భద్రపరిచారు. కాగా, ఈ మమ్మీ 2,400 ఏళ్ల నాటిది. ప్రస్తుతం వర్షాల కారణంగా మ్యూజియంలో మోకాళ్ల పైవరకు నీళ్లు చేరడంతో ఈ మమ్మీకి డ్యామేజ్ జరిగే అవకాశం తలెత్తింది. దీంతో ఈ పురాతన మమ్మీని 130 సంవత్సరాల తరువాత మొదటిసారి పెట్టె నుంచి బయటకు తీశారు. దాన్ని ఓ సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సెంట్రల్ మ్యూజియం సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ చోలాక్ తెలిపారు. ఆలస్యమైతే ఈ మమ్మీ శాశ్వతంగా నాశనమయ్యేదని ఆయన తెలిపారు.

Advertisement

Next Story