World Cup Qualifiers 2023: సూపర్‌ ఓవర్‌‌లో వెస్టిండీస్‌కు షాక్.. నెదర్లాండ్స్ థ్రిల్లింగ్ విక్టరీ

by Vinod kumar |
World Cup Qualifiers 2023: సూపర్‌ ఓవర్‌‌లో వెస్టిండీస్‌కు షాక్.. నెదర్లాండ్స్ థ్రిల్లింగ్ విక్టరీ
X

దిశ, వెబ్‌డెస్క్: World Cup Qualifiers 2023లో భాగంగా నెదర్లాండ్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో స్కోరు సమం చేసిన నెదర్లాండ్స్‌ జట్టు.. సూపర్‌ ఓవర్లో సంచలన విజయం సాధించింది. నెదర్లాండ్స్‌ బౌలర్‌ లోగన్‌ వాన్‌ బీక్‌ సూపర్‌ ఓవర్లో వరుసగా 4,6,4,6,6,4 బాది సెన్సేషనల్‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. అంతకుముందు టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. విండీస్‌కు ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్‌ (76), చార్ల్స్ (54) హాఫ్‌ సెంచరీలతో శుభారంభం అందించగా.. కెప్టెన్‌ షాయీ హోప్‌ (47), నికోలస్‌ పూరన్‌ 104 సెంచరీతో చెలరేడాడు. ఆఖర్లో కీమోపాల్‌ మెరుపు ఇన్నింగ్స్‌(25 బంతుల్లో 46 పరుగులు) ఆడాడు.

దీంతో విండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 374 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌ బ్యాటర్స్‌లో.. ఆంధ్రకు చెందిన బ్యాటర్‌ తేజ నిడమనూరు అద్భుత బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టాడు. 76 బంతుల్లో 111 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌ (67) రాణించాడు. చివర్లో లోగన్‌ వాన్‌ బీక్‌(28), ఆర్యన్‌ దత్‌ (16) మెరుపులు మెరిపించగా ఇరు జట్ల స్కోరు సమమైంది.

దీంతో మ్యాచ్‌ టై కాగా సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వాన్ బీక్‌ బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. అంతేకాదు బంతితోనూ మ్యాజిక్‌ చేశాడు. 32 ఏళ్ల ఈ రైట్‌ ఆర్మ్‌ పేసర్‌ బౌలింగ్‌లో చార్ల్స్ తొలుత సిక్సర్‌ కొట్టగా.. రెండో బంతికి హోప్‌ ఒక పరుగు తీశాడు. మరుసటి రెండు బంతుల్లో వాన్‌ బీక్‌.. చార్ల్స్, హోల్డర్‌లను వరుసగా అవుట్‌ చేశాడు. దీంతో వెస్టిండీస్ 2 వికెట్లు కోల్పోయి 8 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయింది. క్వాలిఫయర్స్‌లో గ్రూప్‌-ఏలో ఉన్న జింబాబ్వే, నెదర్లాండ్స్‌, వెస్టిండీస్‌ ఇప్పటికే సూపర్‌ సిక్సెస్‌కు చేరుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed