ICC World Cup 2023: ఈ తరం అత్యుత్తమ క్రికెటర్‌ అతడే.. Yuvraj Singh

by Vinod kumar |
ICC World Cup 2023: ఈ తరం అత్యుత్తమ క్రికెటర్‌ అతడే.. Yuvraj Singh
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌పై మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు.. ఈ తరం అత్యుత్తమ క్రికెటర్‌గా మారతాడని అభిప్రాయపడ్డాడు. 24 ఏళ్ల గిల్‌లో ఆ సత్తా ఉందన్న విషయాన్ని అతడి బ్యాటింగ్‌ గణాంకాలే చెబుతాయని యువీ తెలిపారు. ఇటీవల ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో రెండు మ్యాచుల్లోనూ గిల్ అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆడిన విషయాన్ని అతడు గుర్తు చేశాడు. వరల్డ్‌ కప్‌లో భారత్‌ తరఫున గిల్ కీలక పాత్ర పోషిస్తాడని పేర్కొన్నాడు.

‘‘శుభ్‌మన్‌ గిల్ ఆట తీరును చూస్తే ముచ్చటేస్తోంది. ఈ తరం అత్యుత్తమ క్రికెటర్‌గా అవతరిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. సాధారణ ఆటగాడిగా కంటే నాలుగు రెట్లు అదనంగా శ్రమిస్తాడు. చిన్నప్పటి నుంచీ ఇలానే ఉన్నాడు. నేను కూడా గతంలో అతడితో ఆడాను. గిల్‌ రాణిస్తే మాత్రం భారత్‌ మ్యాచ్‌ల్లో సులువుగా విజయం సాధిస్తుంది. ఆసీస్‌తో తొలిసారి వన్డే సిరీస్‌లోనూ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇలా ఎవరూ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించలేరు.

కేవలం భారత్‌లోనే కాకుండా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా స్టేడియాల్లో కూడా భారీగా పరుగులు చేయగలడు’’ అని యువీ తెలిపాడు. గిల్ ఇప్పటి వరకు 18 టెస్ట్లులు, 35 వన్డేలు, 11 టీ20ల్లో 3,200కిపైగా పరుగులు సాధించాడు. ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న గిల్ అత్యంత వేగంగా 1000కిపైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఏడాది ఆ మార్క్‌ను రీచ్ అయ్యాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ (208) కూడా అతడి ఖాతాలో చేరింది.

Advertisement

Next Story

Most Viewed