ఐస్ పుల్లలతో టవర్.. గిన్నిస్ రికార్డ్ బ్రేక్

by Shyam |
ఐస్ పుల్లలతో టవర్.. గిన్నిస్ రికార్డ్ బ్రేక్
X

దిశ, ఫీచర్స్ : ‘కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బు బిళ్ల.. కాదేది కవితకు అనర్హం’ అని శ్రీశ్రీ చెప్పినట్టు.. ఏ వస్తువు కూడా వ్యర్థమైంది కాదు. ఆలోచనకు, సృజనాత్మకత తోడైతే పనికిరాని వస్తువులు కూడా కళాత్మకతను సంతరించుకుంటాయి. అలాగే చాలామంది చిన్నపిల్లలు అట్టపెట్టెలు, అగ్గిపుల్లలతో మిద్దెలు, మేడలు కట్టేస్తుంటారు. ఈ క్రమంలో ఐస్‌‌‌క్రీమ్ పుల్లలతో రూపొందించిన కళాకృతులను కూడా చూసే ఉంటారు. కానీ ఇల్‌నాయిస్ (యూఎస్ఎ)లోని నేపర్‌విల్లేకు చెందిన 12 ఏళ్ల బాలుడు ఐస్‌క్రీమ్ స్టిక్ నిర్మాణంతో ఏకంగా గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేశాడు.

తన తండ్రి నిర్మించిన ప్రాజెక్టుల నుంచి స్ఫూర్తి పొందిన ఎరిక్ క్లాబెల్.. తన మొదటి ప్రయత్నంలోనే టవర్ నిర్మాణాన్ని చేపట్టి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించడం విశేషం. ఎరిక్ నిర్మించిన టవర్ 6.157 మీ.(20.20 అడుగులు) ఎత్తు ఉండటం విశేషం. కాగా ఎరిక్‌కు చిన్నతనం నుంచి బొమ్మలు, పడవలు, ఇతర వస్తువులు నిర్మించడం ఇష్టంగా ఉండేది. ఈ క్రమంలో ఐస్‌క్రీమ్ పుల్లలతో ఎన్నో ఆకర్షణీయమైన కళాకృతులను రూపొందించాడు. అతడు చేసిన ఆకృతుల్లో ‘ఇంటి’ని తలపించే ఒక నిర్మాణం ఎంతో బాగుంటుందని ఎరిక్ నాన్న తెలిపాడు. అందులో లైట్లు, ఫర్నిచర్, గృహానికి సంబధించిన వస్తువులు ఉన్నాయి. అవన్నీ కూడా స్టిక్స్‌తోనే చేయడం విశేషం. పాప్సికల్ కుర్చీ కూడా భలే బాగుంటుందన్నారు.

టవర్ నిర్మించేందుకు మూడు అడుగుల పొడవుతో కొన్ని డిజైన్స్ తయారుచేశాను. అయితే అదే స్ట్రక్చర్‌ను పదే పదే చేస్తుండటంతో కాస్త విసుగు అనిపించింది. కానీ దాన్ని రూపొందిస్తున్నప్పుడు ఒక్కో స్టేజ్‌లో పొడవు పెరుగుతున్న కొద్దీ నాకు చాలా ఆనందమేసేది. ప్రస్తుతం నేనే సూపర్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఇష్టపడిన దాంట్లోనే రికార్డ్ సాధించా.
– ఎరిక్ క్లాబెల్

Advertisement

Next Story

Most Viewed