వణుకుతున్న ‘108’ సిబ్బంది

by Shyam |
వణుకుతున్న ‘108’ సిబ్బంది
X

దిశ, మేడ్చల్:
రమేష్(పేరు మార్చాం), మేడ్చల్ జిల్లాలో ఐదేండ్లుగా 108 అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పట్టణ ప్రాంతం.. పైగా అద్దె ఇల్లు.. ఇగ చెప్పేదేముంది. నిత్యావసర వస్తువులు ఏవి కొనాలన్నా చేతిచమురు వదిలించుకోవాల్సిందే. అరకొర వేతనంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. పిల్లల ఫీజులు, కుటుంబ పోషణ అతనికొచ్చే నెల జీతంతో సాధ్యం కావట్లేదు. 108 అంబులెన్స్ డ్రైవర్‌గా 12 గంటల డ్యూటీ ముగియగానే మరో ఐదారు గంటలపాటు స్థానికంగా ఆటోడ్రైవర్ అవతారమెత్తాడు. దాని మీద వచ్చే రూ.100-200తో ఉన్నంతలోనే బతుకు వెళ్లదీస్తున్నాడు. తాజాగా కరోనా వైరస్ దెబ్బకు అతని బతుకు ఛిన్నాభిన్నమయ్యే పరిస్థితి నెలకొంది. ఓ వైపు రవాణా వ్యవస్థ స్తంభించగా, మరోవైపు 108 వాహనం డ్రైవర్‌గా డ్యూటీకి వెళ్దామంటే.. కరోనా వైరస్ బెంబేలెత్తిస్తోంది. భయం దేనికంటారా.. డ్యూటీలో భాగంగా కరోనా వైరస్ లక్షణాలున్నవారిని ఆస్పత్రికి తరలిస్తున్నాడు. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని భయాందోళన చెందుతున్నాడు. 108 అంబులెన్స్ సిబ్బందికి కనీసం మాస్కులు, శానిటైజర్లు కూడా పంపిణీ చేయట్లేదు. డ్యూటీ బంద్ చేద్దామంటే.. జీతం లేక బతుకుడు కష్టమైతది.. డ్యూటీకి పోదామంటే.. కరోనా వైరస్ సోకి బతికే పరిస్థితి లేనట్టుందని సదరు 108 వాహనం డ్రైవర్ వాపోతున్నాడు. ఇది రమేష్ ఒక్కడి పరిస్థితే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి రమేష్‌లు చాలామంది ఉన్నారు.

కరోనా వైరస్ ప్రస్తుతం ఇండియాను వణికిస్తోన్ననేపధ్యంలో దేశవ్యాప్తంగా జనత కర్ఫ్యూను విధించైన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోనూ కర్ఫ్యూను ఈ నెల 31వరకు కొనసాగిస్తున్నారు. అయితే, రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రోగులను ఆస్పత్రులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించే 108 వాహన సిబ్బంది తమకు సరైన సేఫ్టీ కల్పించకపోవడంపట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదని పలువురు వాహన సిబ్బంది చెబుతున్నారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న అనుమానితులను ఆస్పత్రులకు చేర్చిన తర్వాత మరో రోగిని సైతం అదే వాహనంలో తరలించాల్సి వస్తుంది. ఒక రోగిని తరలించగానే వాహనం లోపల శానిటైజర్లుగానీ, ఏదైనా రసాయనాలను గానీ స్ప్రే చేసేందుకు పంపిణీ చేయాలి. కానీ, ప్రభుత్వం అటువంటి చర్యలేవీ చేపట్టకపోవడం వీరి ఆందోళనకు కారణమవుతున్నది.

మాస్కులు మాయం..

వాస్తవానికి 108 అంబులెన్స్ వాహనంలో డ్రైవర్‌తో ఉండే సహాకుడికి సరిపడా మాస్కులు అందుబాటులో ఉండాలి. వాటితోపాటుగానే శానిటైజర్లు, కొంత మెడికల్ కిట్ ఉంటుంది. ఎప్పుడైతే కరోనా వైరస్ కారణంగా మాస్కులకు డిమాండ్ పెరిగిందో.. అప్పటి నుంచి 108 వాహనంలోని సిబ్బందికి సరఫరా చేయాల్సిన మాస్కులు, శానిటైజర్లు మాయమయ్యాయి. దీనిపై వాహన సిబ్బంది పైఅధికారులను అడిగితే.. పైనుంచి సరఫరా లేదు. ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. మీరో కొనుక్కోండి అంటూ ఉచిత సలహాలు ఇవ్వడం గమనార్హం. 108 వాహనాలను పర్యవేక్షించే జిల్లా అధికారులు, ఆ తర్వాతి స్థాయి అధికారులు మాస్కులను మాయం చేసినట్టు తెలుస్తోంది. ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య, కేంద్రాలు, ప్రాంతీయ స్థాయి ఆస్పత్రుల్లో మాస్కులు ఉన్నట్టుండి మాయమైపోయాయి. అవి అందులో పనిచేసే వైద్యులు, సిబ్బంది, అధికారుల ఇండ్లల్లో పదుల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. జిల్లాలోని ఓ అధికారి ఏకంగా మెడికల్ షాపులకు మాస్కులను పెద్దఎత్తున విక్రయించినట్టు తెలుస్తోంది. దీనిపై సదరు అధికారి కింద పనిచేసే సిబ్బంది బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇంతటి కష్టకాలంలో మాస్కులను అమ్ముకుని సొమ్ము చేసుకునే సదరు అధికారు తీరుపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

జాబ్ మానేస్తున్న సిబ్బంది..

కరోనా వైరస్ నియంత్రణలో 108 వాహన సిబ్బంది అవసరం చాలా ఉంటుంది. కానీ, వారికి సరైన వసతులు కల్పించకపోవడంతో భయంతో జాబ్‌లు మానేస్తున్నారు. ఇప్పటికే అనధికారికంగా గ్రేటర్ హైదరాబాద్‌లో 50 మందికిపైగా డ్యూటీలకు రావట్లేదని తెలుస్తోంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులను ఆస్పత్రులకు చేరుస్తున్న 108 వాహన సిబ్బందికి ప్రభుత్వం మాస్కులు, శానిటైజర్లు ఇవ్వకపోడంపై పలువురు మండిపడుతున్నారు. నిజానికి కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న రోగులను ఆస్పత్రులకు చేర్చుందుకు కొన్నిచోట్ల మాత్రమే ప్రత్యేక 108 వాహనాలు ఉన్నాయి. మిగతా అన్నిచోట్ల సాధారణ 108 వాహనాల సిబ్బందే తరలిస్తున్నారు. తమకు కరోనా వైరస్ సోకకుండా తగిన ఏర్పాట్లు చేస్తే నిర్భయంగా డ్యూటీలు చేసుకునే అవకాశం ఉందంటూ పలువురు 108 వాహన సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం 108 వాహన సిబ్బందికి కావాల్సిన మాస్కులు, శానిటైజర్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు సత్వర సేవలు అందనున్నాయి.

Tags: Corona, Medchal, 108 Employees, masks, sanitisers

Next Story

Most Viewed