‘వారు షహీన్ బాగ్ తోనే గట్టెక్కాలనుకుంటున్నారు’

by Ramesh Goud |

కేజ్రీవాల్ ఇంటర్వ్యూ

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొత్తం ఢిల్లీ ఎన్నికల్లో షహీన్ బాగ్ నిరసనలపైనే పోరాడాలనుకుంటున్నారని ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ‘అమిత్ షా ఎంతో శక్తి వంతుడు. ఆయన తలచుకుంటే, షహీన్ బాగ్ నిరసనల వల్ల మూసుకుపోయిన రహదారిని తెరవలేరా’అని ప్రశ్నించారు. మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కేజ్రీవాల్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీలా మరేయితర పార్టీ అబద్ధాలడలేదనీ, అందులోనూ అమిత్ షా ను మించిన వారెవరూ ఉండరని విమర్శించారు. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న షహీన్ బాగ్ నిరసనల వల్ల అక్కడి రహదారి మూసుకుపోయి, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ..‘ అమిత్ షా కేంద్ర హోం మంత్రి. ఆయన తలచుకుంటే ఆ సమస్యను పరిష్కరించడం అసాధ్యమేమీ కాదు. కానీ, ఆయనకు అలా చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే బీజేపీకి మొత్తం ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో షహీన్ బాగ్ నిరసనలు, హిందూముస్లీం, పాకిస్థాన్ అంశాలు తప్ప.. వారు విమర్శించడానికి ఇతర అంశాలేవీ లేవు’ అని మండిపడ్డారు. తమ ప్రభుత్వం చెప్పినట్టు పోలీసులు వింటే, రెండు గంటల్లోనే షహీన్ బాగ్ ను ఖాళీ చేయించేవాళ్లమని అన్నారు.
బీజేపీ నేతలు కేజ్రీవాల్ ను ఉగ్రవాదిగా అభివర్ణించడంపై స్పందిస్తూ.. ‘నేను ఏ కోణంలో ఉగ్రవాదిలా ఉన్నాను? వారు నాపై ఏ విధంగా ఉగ్రవాదని ముద్ర వేయగలరు? అని నిలదీశారు. తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితమిచ్చాననీ, తాను ఢిల్లీ ప్రజలకు పెద్దకొడుకు లాంటోడినని తెలిపారు. ప్రజలకు ఉచిత కరెంట్, ఉచిత నీరు, ఆస్పత్రులు, పాఠశాల వంటి సౌకర్యాలు కల్పించానని వెల్లడించారు. ఢిల్లీ ప్రజలు తానేంటో నిర్ణయించే సమయమిదని చెప్పారు.

Advertisement

Next Story