పుట్ట మధు మెడకు ఉచ్చు.. బిట్టు శ్రీను ధైర్యం ఎవరు?

by Sridhar Babu |   ( Updated:2024-02-03 13:19:22.0  )
ZP chairman Putta Madhu
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: వామన్ రావు దంపతుల హత్య కోసం జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనివాస్ అంత ధైర్యం ఎలా చేశాడు..? ఇంతకీ ఆయన వెనుక ఉన్నదెవరూ..? నిండు ప్రాణాలను బలి తీసుకునేందుకు ఆయన అంత సాహసం చేయడం ఏంటి? అన్న విషయం అటు పోలీసు వర్గాలను, ఇటు సామాన్య జనాన్ని తొలుస్తున్నది. వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితుడు కుంట శ్రీనివాస్ ఇచ్చిన సమాచారం ప్రకారం బిట్టు శ్రీను విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటికే ఇది పక్కా సుపారీ మర్డరేనన్న చర్చ కూడా సాగింది. హంతకుల వెనకున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ చేస్తున్నారు. గురువారం సాయంత్రం వరకు కుంట శ్రీనుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ మర్డర్‌తో ప్రమేయం ఉందని భావించారు.

కానీ అనూహ్మంగా బిట్టు శ్రీను పేరు బయటకు రావడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. పుట్ట మధు వెన్నంటి ఉంటే బిట్టు శ్రీనివాస్ పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిట్టు శ్రీను హత్య కేసు నిందితులకు వేట కొడవళ్లు, కారు ఇవ్వడంతో ఆయన ప్రమేయం తేటతెల్లం అయింది. బిట్టు శ్రీను హత్య విషయంలో తనవంతు పాత్ర పోషించినట్టయితే మామ మధుకు చెప్పకుండా ఎందుకు సాహసించాడన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒక వేళ మధుకు తెలియకుండా బిట్టు శ్రీను ఈ వ్యవహారంలో తలదూరిస్తే ఆయన ఎవరైనా పోలీసు అధికారి సపోర్ట్ తీసుకుని ఉన్నాడా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బిట్టు శ్రీను ఇన్ వాల్వ్ మెంట్ తరువాత గట్టు వామన్ రావు తండ్రి కిషన్ రావు కూడా తన కొడుకు, కోడలు హత్య వెనక పుట్ట మధు హస్తం ఉందని ప్రకటించారు. దీంతో ఈ ఉచ్చు కాస్తా పుట్టమధు మెడకు చుట్టుకోక తప్పని పరిస్థితే తయారైంది.

పోలీసులు సహకరించారా..?

మరోవైపున రామగిరి ఎస్సై తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఇంకా వేరే పోలీసు అధికారులు అండదండలు అందించారా? అన్న విషయంపై చర్చ సాగుతోంది. వీరు రామగుండం కమిషనరేట్ పరిధిలోని వారా లేక వేరే ప్రాంతానికి చెందిన వారా అన్న కోణంలోనూ ఆరా తీస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. ప్రధానంగా సాక్ష్యాలు చిక్కుకుండా నిందితులు వ్యవహరించిన తీరు కూడా పోలీసుల పరోక్ష సహకారంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కసితో ప్రాణాలు తీయాలనుకునే వారు సాక్ష్యాలను చిక్కవద్దన్న జాగ్రత్త తీసుకునే అవకాశం ఉండదని, కోపంతో అప్పటికప్పుడు నేరానికి పాల్పడుతారు తప్ప పక్కా స్కెచ్ వేసే అవకాశం లేదన్నది వాస్తవం. ఇంకో వైపున వేటకొడవళ్లు ఓ షాపు నుంచి బిట్టు శ్రీను తీసుకొచ్చి కుంట శ్రీనివాస్ కు అప్పగించారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ షాపు యజమాని కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఆయన పాత్ర ఏంటి అన్న విషయాన్ని వెలుగులోకి తీసుకురావల్సిన అవసరం ఉంది. కత్తులు ఆ ప్రజాప్రతినిధి సమకూర్చాడా? లేక బిట్టు శ్రీనే ముందుగా తీసుకొచ్చి అందులో పెట్టాడా? అన్న విషయంపై స్పష్టత రావాలి.

ఒక వేళ బిట్టు శ్రీనే వేటకొడవళ్లు తీసుకొచ్చినట్టయితే సదరు షాపు ఓనర్, కం ప్రజాప్రతినిధి పోలీసులకు సమాచారం ఇస్తే రెండు నిండు ప్రాణాలు కాపాడడంతో పాటు, సంచలనమైన కేసుకు బ్రేకులు పడేవి. కానీ ఆయన కూడా అలా చేయకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది. కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ కారణంగానే ప్రభుత్వ తప్పిదాన్ని ఎత్తి చూపుతుంటే, పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను, టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ప్రజాప్రతినిధి సపోర్టు వెలుగులోకి రావడం పుట్ట మధును మరింత ఇరకాటంలో పెట్టినట్టే అయింది. ఘటనకు ముందు మంథనిలో జరిగిన సీఎం కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో కుంట శ్రీనుతో పాటు ప్రజాప్రతినిధి పుట్ట మధుతో కలిసి ఉన్న ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఓ వైపు కత్తులు ఇచ్చిన నేత మరో వైపు పీకలు కోసిన నేత మధ్య ముఖ్య నేత అంటూ ఫొటోలను వైరల్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed