మీ 'పలకరింపు' ముఖ్యం : వైవీఎస్ చౌదరి

by Shyam |
మీ పలకరింపు ముఖ్యం : వైవీఎస్ చౌదరి
X

కరోనా కాటేస్తోంది. ఎటువైపు నుంచి ఎలా వచ్చేస్తోందో తెలియని వైరస్ … మనల్ని పట్టుకుందంటే మటాషే… జాగ్రత్తగా ఉండాలి…. ఇంట్లో వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి… అనుకుంటున్నారు ప్రజలు. అయితే తప్పకుండా మీరు మీ కుటుంబ సభ్యులని జాగ్రత్తగా కాపాడుకోవాలి… దాంతో పాటు మీ బంధువులు, స్నేహితులు, మీ దగ్గర పని చేసే వారిని కూడా పలకరించండి.. వారికి మీరున్నారే భరోసా ఇవ్వండి అని సూచిస్తున్నారు దర్శకులు వై.వి.ఎస్.చౌదరి. కుశలమేనా అనే పలకరింపు వారిలో మానసిక స్థైర్యాన్ని, మనో నిబ్బరాన్ని నింపుతుందంటున్నారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వీలైతే ఆర్థికంగా కూడా చేయూతనివ్వండని పిలుపునిస్తున్నారు. ‘ పలకరింపు’ మనుషుల మధ్య అనుబంధాన్ని ఎలా పెంచగలదో చెప్తూ నోట్ రిలీజ్ చేశారు వైవిఎస్ చౌదరి.

‘కుశలమా’!
‘నీవు కుశలమేనా’!!

అది పాత తెలుగు సినిమా పాటా కాదు, కేవలం నాలుక మీద నుండీ దొర్లిన పదాల కలయికా కాదు. పై పదాల కలయిక.. మనం మన ఆత్మీయుల యోగక్షేమాలను తెలుసుకోవాలనుకునే తొలి ‘పలకరింపు’. మన మధ్య జరిగిన పూర్వ పరిచయాల వల్ల పుట్టుకొచ్చిన అనురాగం, అనుబంధాలను నెమరువేసుకునే తొలి ‘పలకరింపు’.

‘కరోనా-వైరస్‌’ వ్యాప్తి లాంటి విపత్కర పరిస్థితుల్లో.. ఆ ‘పలకరింపు’కి పని కల్పించండి. మన సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, మన వద్ద పనిజేస్తున్న వాళ్ళు ఎక్కడున్నా వారి యోగ-క్షేమాల్ని తెలుసుకోవడమే కాకుండా.. మీ మాటల ద్వారా గానీ, చేతల ద్వారా గానీ వారిలో మానసిక స్థైర్యాన్ని, మనో నిబ్బరాన్ని నింపండి. వారికి అవసరమైతే.. మీకు కుదిరినంతలో ఆర్ధికంగా చేయూతనివ్వండి.

నిపుణుల సలహా, సంప్రదింపుల ద్వారా మన ప్రభుత్వాలు విధించిన ఆంక్షలకు అనుగుణంగా మసలుకుంటూ, ప్రకటించిన పధకాలను వినియోగించుకుంటూ, ‘కరోనా-వైరస్’‌ కట్టడికి చేపట్టాల్సిన జాగ్రత్తల్ని స్వయం నియంత్రణతో పాటిస్తూ.. మిమ్మల్ని మరియూ మీ కుటుంబసభ్యులను కాపాడుకుంటూ బాధ్యతగల పౌరులుగా ఇంటిపట్టునే ఉండాల్సిందే అనే సందేశాల్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఒకరికొకరు పంచుకోండి.

ఆ దేవుని దయతో ప్రస్తుతానికి నేను, నా కుటుంబ సభ్యులంతా క్షేమం. అదే దేవుని దయ మీకూ ఉంటుందని ఆశిస్తూ, ఉండాలని కోరుకుంటూ.. మీ క్షేమ సమాచారాన్ని తెలుపగోరుతూ..

మీ
భవదీయుడు,
వై. వి. ఎస్‌. చౌదరి.

Tags : YVSChowdary, Coronavirus, Covid19

Advertisement

Next Story

Most Viewed