వైఎస్సార్సీపీ నేత పీవీపీ అరెస్టు

by srinivas |
వైఎస్సార్సీపీ నేత పీవీపీ అరెస్టు
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ సినీ నిర్మాత, వైఎస్సార్సీపీ నేత పీవీపీ (పొట్లూరి వరప్రసాద్)ను హైదరాబాద్‌లో బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విక్రమ్ అనే వ్యక్తి ఇంట్లో చొరబడి, ఫర్నిచర్ ధ్వంసం చేసిన కేసులో ఐపీసీ 447, 427, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే…

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ప్రేమ్ పర్వత్ విల్లాస్ పేరిట పీవీపీ నిర్మాణాలు చేపట్టారు. ఇందులో కైలాస్ విక్రమ్ అనే వ్యక్తి నాలుగు నెలల క్రితం విల్లాను కొనుగోలు చేశారు. అనంతరం దాని ఆధునికీకరణ పనులు చేపట్టారు. దీని గురించి తెలుసుకున్న పీవీపీ తన అనుచరులతో కలసి విల్లా దగ్గరకు చేరుకుని, ఆధునికీకరణ సామగ్రి దించుతున్న వారిని అడ్డుకున్నారు. విల్లాను విక్రయించినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంచాలంటూ బెదిరింపులకు దిగారు. దీంతో వారు విక్రమ్‌కు సమాచారం అందించడంతో ఆయన అక్కడకు చేరుకున్నారు.

తాను కొనుగోలు చేసిన విల్లాను ఎలా మార్చుకోవాలో నిర్ణయించే అధికారం తనకు మాత్రమే ఉందని చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తన అనుచరులతో విక్రమ్ ఇంట్లో ప్రవేశించిన పీవీపీ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో విక్రమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పీవీపీ శాంతించకపోవడంతో పీవీపీపై లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తనపై పీవీపీ దౌర్జన్యానికి దిగారని, చంపుతానని బెదిరించారని, ఆయన వల్ల తనకు ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు. దీంతో వారిద్దర్నీ బంజారహిల్స్ ఏసీపీ స్టేషన్‌కు పిలిపించి సయోధ్యకు ప్రయత్నించారు. అయినప్పటికీ వివాదం సద్దుమణగకపోవడంతో పీవీపీతో పాటు మరో 9 మందిపై మూడు సెక్షన్లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Advertisement

Next Story

Most Viewed