YS షర్మిల సంచలన నిర్ణయం.. సీతక్క ఇలాకాలో పోరాటం షురూ.!

by Shyam |
YS షర్మిల సంచలన నిర్ణయం.. సీతక్క ఇలాకాలో పోరాటం షురూ.!
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ‌లో పార్టీ ప్రకటన త‌ర్వాత వైఎస్ ష‌ర్మిల‌ స్పీడ్ పెంచారు. అధికార ప‌క్షంపై ఒత్తిడి తెచ్చేలా త‌న పోరాట అజెండాను రూప‌క‌ల్పన చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రతీ మంగ‌ళ‌వారం నిరుద్యోగుల ప‌క్షాన వారిలో భరోసా కల్పించేందుకు నిరుద్యోగ నిరాహార దీక్షకు పూనుకున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ఈ బుధవారం నుంచి గిరిజనుల ప‌క్షాన మ‌రో యాత్రకు శ్రీకారం చుట్టారు. పోడు భూముల్లో ప‌ట్టాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ బుధవారం తాడ్వాయి మండ‌లం లింగాల ఏజెన్సీ గ్రామం వేదికగా త‌న పోడు యాత్రను షర్మిల ప్రారంభించ‌బోతున్నారు.‌

ప్రతీ మంగ‌ళ‌వారం నిరుద్యోగుల ప‌క్షాన ఉద్యోగ దీక్ష చేస్తూనే మ‌రో పోరాట అంశాన్ని ష‌ర్మిల త‌న భుజాన వేసుకున్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ప‌నిచేసిన సమయంలో తెలంగాణ‌లో ఎంతో మంది గిరిజ‌నుల‌కు పోడు భూముల్లో ప‌ట్టాలు ఇచ్చార‌ని, తెలంగాణ‌లో గిరిజ‌నులు ప‌ట్టాల‌ కోసం ఆందోళ‌న చేస్తున్నా స‌ర్కార్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని గ‌తంలోనే ష‌ర్మిల‌ ప్రకటించారు.

ఈ క్రమంలోనే గిరిజ‌నుల‌కు ప‌ట్టాల‌ కోసం పోడు యాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈనెల 18న ములుగు జిల్లా నుంచి త‌న పోడు యాత్రను ప్రారంభిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంత‌మైన తాడ్వాయి మండ‌లం లింగాల గ్రామంలో గ‌త కొన్నేళ్లుగా పోడు భూముల్లో ప‌ట్టాలు ఇవ్వాలని గిరిజ‌నులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేస్తూనే ఉన్నారు. త‌న తండ్రి వైఎస్సార్ హయంలో గిరిజనుల‌కు పోడు భూముల్లో హ‌క్కు ప‌త్రాలు ఇచ్చార‌ని, కేసీఆర్ స‌ర్కార్ గిరిజ‌నుల‌పై చిన్నచూపు చూస్తూ అటవీశాఖ సిబ్బందితో చిత్ర హింస‌ల‌కు గురి చేస్తున్నార‌ని షర్మిల ఆరోపించారు.

పోడు భూములకు ప‌ట్టాలు ఇచ్చే వ‌ర‌కు త‌న పోరాటం ఆగ‌ద‌ని లింగాల వేదిక‌గా ష‌ర్మిల ప్రకటించనున్నారు. పార్టీ నిర్మాణం, పాదయాత్ర ప్రారంభించేలోపు తెలంగాణ‌లో స‌ర్కార్ వైఫ‌ల్యాల‌పై పోరు యాత్రల పేరుతో జిల్లాలను చుట్టి వ‌చ్చేలా ష‌ర్మిల త‌న కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా షర్మిల చేపట్టనున్న పోడుయాత్ర గతంలోనే చేపట్టాల్సింది ఉండగా పలు కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గంలో షర్మిల పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story