పులివెందులలో వైఎస్ షర్మిల పర్యటన.. వారంతా దూరం

by srinivas |
YS SHARMILA
X

దిశ, వెబ్ డెస్క్: దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె, సీఎం వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తన పుట్టిల్లు పులివెందులలో పర్యటించారు. సోమవారం ఉదయం ఆమె చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తల్లి విజయమ్మ, చిన్నమ్మ సౌభాగమ్మ, చెల్లెలు సునీతతో కలిసి పులివెందులలోని వైఎస్ వివేకా ఘాట్ వద్ద నివాళి అర్పించారు. ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

వైఎస్ఆర్ ఘాట్ లో ఒంటరిగా:
మాజీమంత్రి, చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం ఆమె ఇడుపుల పాయకు వెళ్లారు. తన తండ్రి వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించి నివాళి అర్పించారు. ఆ సమయంలో షర్మిల వెంట కొద్దిమంది అనుచరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారని సమాచారం. అయితే కుటుంబ సభ్యులెవరూ ఆమె వెంట లేరని తెలుస్తోంది. దీంతో ఆమె ఒంటరిగానే తండ్రికి నివాళులర్పించారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొత్తపార్టీ పెడుతున్నట్లు ప్రకటించన తర్వాత తొలిసారి:
వైఎస్ షర్మిల ఎప్పుడు ఇడుపులపాయ వెళ్లినా ఆమె చుట్టూ కుటుంబ సభ్యులు తోడుగా ఉండేవారు. ఆమె ఎప్పుడూ ఒంటరిగా కనిపించలేదు. కానీ ఈసారి మాత్రం ఒంటరిగా కనిపించారు. ఇడుపుల పాయకు ఎప్పుడు వెళ్లినా కుటుంబ సభ్యులు తోడుగా ఉండేవారని..చిన్నాన్నలు ఇతరులు కలిసి ఆమెకు తోడుగా వెళ్లేవారు. అయితే ఈ సారి కొత్తగా పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన తర్వాత తొలిసారిగా వెళ్లారు. ఈ పర్యటనలో ఎవరూ ఆమె వెనుక కనిపించలేదు. దీంతో ఆమెకు కుటుంబ సభ్యులు దూరమయ్యారా అన్న అంశంపై చర్చ జరుగుతుంది. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఏప్రిల్ 9న ఖమ్మం వేదిక ఆమె తన రాజకీయ పార్టీ పేరు, జెండా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పాదయాత్రపై కూడా ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వైఎస్ షర్మిల హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్ నివాసంలో వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తోన్నారు.

Advertisement

Next Story

Most Viewed