అవ్వ పెట్టదు.. అడుక్కు తిననీయదన్నట్లు కేసీఆర్ తీరు

by Shyam |   ( Updated:2021-07-26 22:49:37.0  )
YS Sharmila Twitter
X

దిశ, తెలంగాణ బ్యూరో : అవ్వ అన్నం పెట్టదు.. అడుక్కు తిననీయదన్నట్లుగా సీఎం కేసీఆర్ తీరు మారిందని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల సోమవారం ట్వీట్ చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు 5 లక్షల ఎకరాల పంట నీట మునిగిందని ఆమె తెలిపారు. తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కూడా రైతులకు అందకుండా గత ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించిందని పేర్కొన్నారు. సొంత పంటల బీమా పాలసీని ప్రవేశపెడతామని గొప్పలు చెప్పినా నేటి వరకూ ఎందుకు అమలు చేయడం లేదని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనివల్ల అటు కేంద్రం నుంచి వచ్చే బీమా వర్తించక, ఇటు రాష్ట్ర బీమా దిక్కులేక రైతులు నష్టాల పాలవుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఇకనైనా మేల్కొని రైతులకు నష్టం జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.

పుల్లెంలలో షర్మిల పర్యటన

వైఎస్ షర్మిల నిరుద్యోగుల్లో భరోసా నింపేందుకు ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపడుతోంది. అందులో భాగంగా ఆమె ఈ మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం, చండూరు మండలం, పుల్లెంల గ్రామంలో పర్యటించనున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడంలేదని ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన శ్రీకాంత్ కుటుంబసభ్యలను షర్మిల పరామర్శించనున్నారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆమె నిరాహారదీక్షను చేపట్టనున్నట్లు వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, నాయకులు భారీగా హాజరై షర్మిల చేపడుతున్న దీక్షకు మద్దతు తెలపాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed