చేపల వల కోసం ఆరాటం.. వరద ఉధృతికి ఎదురెళ్లిన యువకులు

by Shyam |   ( Updated:2021-09-27 06:02:01.0  )
చేపల వల కోసం ఆరాటం.. వరద ఉధృతికి ఎదురెళ్లిన యువకులు
X

దిశ, కామారెడ్డి :కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ శివారులోని మత్తడి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కామారెడ్డి మండలం గర్గుల్ నుంచి కన్నాపూర్ వెళ్లే రహదారి పై నుంచి వాగు పొంగిపొర్లుతుండటంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ క్రమంలోనే వాగు ప్రవాహంలో చేపలు పట్టడానికి కొందరు యువకులు అష్టకష్టాలు పడ్డారు. వాగులో వల సహాయంతో చేపలు పట్టడానికి ప్రయత్నించగా నీటి ఉధృతికి వల కొట్టుకుపోయింది. దీంతో వల తాడు చివరి కొనపట్టుకుని అది కొట్టుకుపోకుండా యువకులు తీవ్రంగా ప్రయత్నించారు.

అయితే, కాసేపటికి ప్రవాహం ఎక్కువ కావడంతో యువకులు వలను ఎలాగైనా కొట్టుకుపోకుండా ఉండేందుకు ప్రాణాలను అడ్డుపెట్టి ప్రయత్నించారు. సుమారు అరగంట పాటు వాగు ప్రవాహానికి అడ్డుగా నిలబడి తీవ్రంగా శ్రమించి చివరికి వలను కొట్టుకుపోకుండా చూశారు. ఆ సమయంలో వాగుకు రెండు వైపులా ఆగియున్న కొందరు గ్రామస్థులు యువకులను వారించినా వినిపించుకోలేదు.

ఈ సందర్బంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తుందన్నారు. రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయని, చివరికి వ్యవసాయ పనులకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు. రెండు సంవత్సరాల కిందట ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయాడని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు.

Advertisement

Next Story