ప్రియురాలి పేరిట పుస్తకం రాసిన ప్రియుడు…ఆత్మహత్యాయత్నం

by Anukaran |   ( Updated:2021-01-10 10:23:59.0  )
ప్రియురాలి పేరిట పుస్తకం రాసిన ప్రియుడు…ఆత్మహత్యాయత్నం
X

దిశ, సూర్యాపేట: ప్రేమించిన అమ్మాయి పెండ్లికి నిరాకరించిందని యువకుడు పురుగుల మందు తాగి ఆత్యహత్యకు యత్నించిన ఘటన సూర్యాపేట జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి… సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన ఇరుగు రామన్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో మల్టీమీడియా రంగంలో వెబ్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. మునగాల మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన ఓ యువతితో రామన్ ప్రేమలోపడ్డాడు. వీరిద్దరి మధ్య పదేండ్లు ప్రేమాయణం సాగింది.

ఆ యువతి సూర్యాపేట జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు ఉద్యోగం రాక ముందు వరకూ కలిసి తిరిగీ… ఉద్యోగం వచ్చిన తరువాత యువతి తనను పట్టించుకోవడం లేదని రామన్ మనస్థాపానికి గురయ్యాడు. కాగా తమ పది సంవత్సరాల ప్రేమకు గుర్తుగా ఓ పుస్తకాన్ని కూడా రామన్ రాశాడు. దానిని తన మిత్రులకు పంచి పెట్టాడు. ఈ క్రమంలో పుస్తకాలు పంచి పెట్టి, తమ కాల్ రికార్డింగ్‌లు వెబ్‌సైట్‌లో పెట్టి తన పరువుకు భంగం కలిగిస్తున్నాడని రామన్ పై సదరు యువతి చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మనస్థాపం చెందిన రామన్ పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. వెంటనే స్పందించిన పట్టణ పోలీసులు రామన్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రేమకు గుర్తుగా పుస్తకం…
ఆ యువకుడు.. ‘నా మరణ కథ.. నా యువరాణి- నా అర్థాంగికి అంకితం’ అనే పుస్తకం రాశాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని.. యువతిని ఎవరు ఇబ్బంది పెట్టకూడదని పుసక్తంలో రాశాడు. నిన్ను ఉపాధ్యాయురాలిని చేయడానికి పది సంవత్సరాలు కష్టపడ్డానని వాపోయాడు.

Advertisement

Next Story