మలేషియా సముద్ర తీరంలో సూర్యాపేట యువకుడు గల్లంతు

by Shamantha N |   ( Updated:2021-10-19 03:08:54.0  )
Malashia-Nevi1
X

దిశ, సూర్యాపేట: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన ఓ యువకుడు మలేషియా సముద్ర తీరంలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. తుంగతుర్తికి చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ సూర్యాపేటలో నివాసం ఉంటున్నారు. అతని పెద్ద కుమారుడు రిషి వర్ధన్ రెడ్డి (21) ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళలోని మత్స్యన్ నేవీ సంస్థలో కోస్టుగార్డు ఉద్యోగంలో చేరి మలేషియా వెళ్లారు. సోమవారం రిషి వర్ధన్ రెడ్డి విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో నౌక నుంచి ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయినట్లు మలేషియా మత్స్యన్ నేవీ షిప్ కెప్టెన్ తమకు సమాచారం అందించారని వెంకటరమణారెడ్డి తెలిపారు. కుమారుడి మిత్రులను వాకబు చేయగా సముద్రంలో రిషి వర్ధన్ రెడ్డి పడిపోయాడని, వెంటనే గాలింపు చేపట్టారని.. అయినా ఆచూకీ లభించలేదని… మళ్లీ గాలింపుచేపడతారని వారు వివరించినట్లు తెలిపారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఏజెన్సీ వాళ్లు రూ. 8 లక్షలు తీసుకుని మోసం చేశారని, ముందు ఒక విధంగా చెప్పి, డబ్బులు తీసుకుని తీరా మలేషియా వెళ్లాక….తన కుమారుడితో లేబర్ పని చేయించారని వెంకట రమణా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Next Story