- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యడియూరప్ప.. ఫైటర్‌వప్పా.. జీవితమంతా పోరాటమే
బెంగళూరు: బీఎస్ యడియూరప్ప నిరంతరం తీరాన్ని తాకాలని ఉబలాటపడే అలసిపోని అల లాంటి వ్యక్తి. ఎంతటి వైఫల్యాలు ఎదురుపడ్డా ప్రయాణాన్ని ఆపని అలుపెరుగని బాటసారి. ఆయన అనుకున్నది సాధించుకోవడానికి రేయింబవళ్లు శ్రమిస్తారు. అందుకే సన్నిహితుల్లో ఇన్‌స్పిరేషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు. ఆయన జీవితం, రాజకీయ ప్రస్థానమంతా గెలుపోటములు, అద్భుత విజయాలు, అవమానకర భంగపాట్లు, అనూహ్య మలుపులతో సమ్మిళితమై ఉంటాయి. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడి నాలుగుసార్లూ గద్దెనెక్కినప్పటికీ అర్ధంతరంగానే దిగిపోయారు. చివరికి చిరకాలంగా కోరుకున్న సీఎం పదవికే రాజీనామా చేశారు. రాష్ట్రంలో లింగాయత్ అగ్రనేతగా పేరున్న యడియూరప్ప తన రాజకీయ జీవితంలో ఎక్కువగా రైతు నేతగానే సుపరిచితుడు. ఆయన గురించి సంక్షిప్తంగా..
వారాంతపు సంతలో నిమ్మకాయలమ్మి..
1943లో పేద రైతు కుటుంబంలో జన్మించిన బూకనకెరె సిద్ధలింగప్ప యడియూరప్ప(బీఎస్‌వై)(Bookanakere Siddalingappa Yediyurappa) చిన్నప్పుడే తల్లిని కోల్పపోయారు. తన చదువు, కుటుంబ అవసరాల కోసం వారాంతపు సంతలో నిమ్మకాయలమ్మారు. బెంగళూరులోని ఓ ఫ్యాక్టరీలో హెల్పర్‌గా పని చేశారు. 1960లో ఆర్ఎస్ఎస్‌తో అనుబంధంలోకి వచ్చి ప్రచారక్ అయ్యారు. షిమోగా జిల్లాలో ఓ రైస్ మిల్‌లో క్లర్క్‌గా చేరి యజమాని కూతురితో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఆర్ఎస్ఎస్‌తో అనుబంధాలు కొనసాగిస్తూనే రాజకీయంలోకి ప్రవేశించారు.
రాజకీయ ప్రస్థానం..
షిమోగ సోషలిస్టుల హవా ఉన్న ఏరియా. 1970ల్లో ఆయన తొలిసారి భారతీయ జన సంఘ్ టికెట్‌పై షికారిపుర మున్సిపాలిటి సభ్యుడిగా ఎన్నికయ్యారు. అణగారిన రైతులు, కార్మికుల గొంతుకగా మారారు. వారి హక్కుల కోసం పోరాడారు. 1983లో షికారిపుర నుంచి కర్ణాటక అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఏడుసార్లు వరుసగా విజయాన్ని కైవసం చేసుకున్నారు. నాలుగు సార్లు సీఎం పీఠాన్ని అధిరోహించారు. జేడీఎస్‌తో మద్దతుతో 2007లో తొలిసారిగా సీఎం ప్రమాణం తీసుకున్నారు. కానీ, కుమారస్వామి దెబ్బతో వారం రోజుల్లోనే కలలు కల్లలయ్యాయి. 2008లో బీజేపీని యడియూరప్ప విజయతీరాలకు చేర్చి దక్షిణాదిలో తొలిసారి కమలాన్ని వికసింపజేశారు. మెజార్టీకి మూడు సీట్ల దూరాన నిలిచిన ఆ ప్రభుత్వం 38 నెలలే మనుగడ సాగించింది. మైనింగ్ కుంభకోణం కేసులో జైలుకెళ్లాల్సి వచ్చింది. జైలుకెళ్లిన తొలి సీఎంగానూ ఆయనపై మచ్చపడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచినా యడియూరప్ప 56 గంటలు మాత్రమే సీఎంగా ఉన్నారు. అటుతర్వాత ఏర్పడ్డ జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయాక మళ్లీ సీఎం పీఠాన్ని అధిరోహించి తాజాగా రాజీనామా చేశారు.
సీఎం రేసులో..
బీజేపీ స్ట్రాంగ్ ఓటర్ బేస్ అయి లింగాయత్ కమ్యూనిటీకి చెందిన నేత యడియూరప్ప స్థానాన్ని భర్తీ చేయడం పార్టీకి కత్తిమీద సాము. సామాజిక సమీకరణాలపైనే అంతా ఫోకస్ ఉన్నది. అయినప్పటికీ సీఎం పోస్టు కోసం చాలా మంది రేసులో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇందులో కీలకంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర మాజీ మంత్రి డీవీ సదానంద గౌడ, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ సీటీ రవి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బీఎల్ సంతోష్‌ల పేర్లు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. జోషి, సంతోష్‌లు బ్రాహ్మణ సామాజికవర్గం. ఇదే సామాజిక వర్గానికి చెందిన అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్దె కగేరి కూడా రేసులో ఉన్నారు. కాగా, మరో ప్రాబల్య వర్గం వొక్కాలిగా నేత రవితోపాటు వీరశైవ-లింగాయత్ కమ్యూనిటీకి చెందిన రాష్ట్రమంత్రి మురుగేష్ నిరాణి, ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్‌లూ రేసులో కీలకంగా ఉన్నారు.