‘శోభనానికి పనికిరావు’.. జగనన్న ఇళ్లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by srinivas |
‘శోభనానికి పనికిరావు’.. జగనన్న ఇళ్లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ఏపీబ్యూరో: ఏపీ సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం అందరికీ ఇళ్లు. ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ‘జగనన్న కాలనీ’ల పేరుతో ఇళ్లు నిర్మించి ఇస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఈ పథకంపై సీఎం జగన్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగనన్న ఇళ్లపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. నెల్లూరు జిల్లాలో హౌసింగ్ రివ్యూలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగనన్న ఇళ్లలో బెడ్రూమ్స్ సరిగ్గా లేవన్నారు. ఆ బెడ్‌ రూమ్స్‌లో పెళ్ళయిన కొత్త జంటలు శోభనం చేసుకోవడం కూడా కష్ట మేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అర్బన్ ప్రాంతాల్లో కేవలం 6 అంకణాల్లోనే ఇళ్లు నిర్మించనున్నారని.. అలాంటి ఇళ్లలో హాల్లో శోభనం చేసుకొని బెడ్రూమ్‌లో పడుకోవాల్సి వస్తుందంటూ ఎమ్మెల్యే పంచ్‌లు వేశారు. లబ్ధిదారులు బెడ్ రూమ్‌లో పెద్ద మంచం వేయాల్సి వస్తే కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. బాత్‌రూమ్ బయట ఏర్పాటుచేసి బెడ్రూమ్ సైజు పెంచితే బాగుంటుందని సూచించారు. ఇకపోతే జగనన్న ఇళ్లపై అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ప్రసన్నకుమార్ రెడ్డి కామెంట్స్‌పై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

Next Story