సాధారణ సాగును దాటిన యాసంగి

by Shyam |
సాధారణ సాగును దాటిన యాసంగి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో యాసంగి సాగు అంచనాలు దాటి పోయింది. అనుకున్నట్టుగానే పంటల సాగు పెరిగింది. గత ఏడాది యాసంగితో పోలిస్తే ఈసారి గణనీయంగా పెరిగింది. యాసంగిలో మొత్తం సాధారణ సాగు 36,93,016 ఎకరాలు ఉండగా.. బుధవారం నాటికి 37,82,309 ఎకరాల్లో పంటలు వేశారు. గతేడాది ఇదే సమయానికి 30,10,879 ఎకరాల్లో పంటలు వేశారు. ఈసారి దాదాపుగా ఏడు లక్షల ఎకరాల్లో ఎక్కువ సాగు అవుతోంది. కొన్నిచోట్ల ఇంకా పంటలు వేస్తున్నారు. దీంతో యాసంగి సాగు 40 లక్షల ఎకరాలు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

28 లక్షల ఎకరాల్లో వరి

ఈ యాసంగి సీజన్‌లో వరి సాగు పెరిగింది. గతేడాదితో పోలిస్తే దాదాపు రెండింతలైంది. వరి సాధారణ సాగు 22.19 లక్షల ఎకరాలు ఉండగా.. బుధవారం నాటికి 27.95 లక్షల ఎకరాలు దాటింది. గత ఏడాది ఇదే సమయానికి 18.09 లక్షల ఎకరాలు మాత్రమే సాగైంది. కానీ ఈసారి దాదాపుగా పది లక్షల ఎకరాలు పెరిగింది. మొక్కజొన్న కూడా 2.66 లక్షల ఎకరాల్లో వేశారు. ఇక శనగ పంట 3 లక్షల ఎకరాలు దాటింది. అదే విధంగా పొద్దు తిరుగుడు 2.16 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఈసారి మొత్తం 102 శాతం పంటలు వేసినట్లు నమోదైంది.

గ్రామాల వారీగా సర్వే

ఇక గ్రామాల వారీగా యాసంగి పంటల సర్వే చేపట్టారు. ప్రతి గ్రామంలో సాగవుతున్న భూమి, ఏ ఏ పంటలు వేశారు, నీటి లభ్యత వంటి అంశాలన్నింటినీ వ్యవసాయ శాఖ సర్వే చేస్తోంది. రైతులు యాసంగిలో వేసే ప్రతి పంటను ఏఈఓల దగ్గర నమోదు చేయించుకోవాలని ఇప్పటికే ఆదేశాలిచ్చారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సరైన ప్రచారం లేకపోవడంతో పంటల నమోదు సరిగా కావడం లేదు. ఇటీవల సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రతి గుంటలో పండిన పంట నమోదు కావాలని ఆదేశించారు. దీంతో మళ్లీ ఏఈఓలు గ్రామాల వారీగా వేసిన పంటలను పరిశీలిస్తున్నారు. పంటల వివరాలను సేకరిస్తున్నారు. ఇంకో నాలుగైదు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపించనున్నారు.

ఆన్‌లైన్‌లో ఉంటేనే అమ్మకాలంటూ భయం

మరోవైపు గ్రామాల వారీగా సాగు సర్వే చేస్తున్న అధికారులు.. పండించే ప్రతి పంట నమోదు చేసుకోవాలని చెబుతున్నారు. వ్యవసాయ భూముల సర్వే నంబర్ల ఆధారంగా గుర్తిస్తూ వేసిన పంటలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. పంట చేతికి వచ్చిన తర్వాత సంబంధిత రైతు ఉత్పత్తులను విక్రయించేందుకు మార్కెట్‌కు వెళ్తే ఆన్‌లైన్‌లో నమోదు చేసిన ప్రకారమే కొనుగోలుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే ఏ పొలంలో ఏ పంట వేశారనేది క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story