రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు: యనమల

by srinivas |
Yanamala Ramakrishnudu
X

కరోనాను తేలికగా చూస్తూ తప్పుడు లెక్కలతో ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కరోనా సాధారణమేనని, వస్తుంది, దానికదే పోతుందంటూ జగన్ వ్యాఖ్యానించడం సరికాదని ఆయన హితవు పలికారు. అలా వచ్చి పోవడానికి ఏమన్నా చుట్టమా? అని ఆయన ఎద్దేవా చేశారు.

కరోనా మరణాలపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటన అనుమానాలు రేకెత్తిస్తోందని అన్నారు. కరోనాపై నిజాలు బయటకు పొక్కకుండా వైఎస్సార్సీపీ నేతలు కృషి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మృతుల సంఖ్యను దాచేస్తే కరోనా కార్చిచ్చులా కాల్చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఏపీలో ఎక్కువ పరీక్షలు చేస్తున్నారు కాబట్టే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని చెప్పడం ఆత్మవంచనేనని ఆయన అభిప్రాయపడ్డారు. అలా చెబుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని యనమల మండిపడ్డారు.

దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన 15 జిల్లాల్లో కర్నూలు కూడా ఒకటని ఆయన గుర్తు చేశారు. కరోనా కట్టడికి నిపుణులంతా తలలు పట్టుకుంటే, జగన్ నిర్లక్ష్య ధోరణితో ఉన్నారని ఆయన విమర్శించారు. ఈ తీరుతోనే ఏపీలో కరోనా విజృంభిస్తోందని ఆయన మండిపడ్డారు. కరోనా కేసుల వృద్ధి రేటులో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందని ఆయన అన్నారు.

tags: corona virus, covid-19, ap, tdp, yanamala ramakrishnudu, ysrcp

Advertisement

Next Story