- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్ధమైన యాదాద్రి.. ఫిబ్రవరి 16న ముహూర్తం?
యాదాద్రి పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. త్వరలోనే ప్రధానాలయంలో భక్తులను దర్శనానికి అనుమతించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆలయ ప్రధాన పనులన్నీ ఇప్పటికే పూర్తి కాగా, మిగిలినవి త్వరితగతిన కొనసాగుతున్నాయి. స్వామి వారి కైంకర్యాలకు ఉద్దేశించిన పుష్కరిణిని సిద్ధం చేశారు. దిగువన మరో పుష్కరిణిని నిర్మిస్తున్నారు. వసంతపంచమి లేదా రథసప్తమి రోజున గుడిని పున:ప్రారంభించేందుకు అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
దిశ ప్రతినిధి, నల్లగొండ/ ఆలేరు : యాదాద్రిని దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దే పనులు చివరి దశకు చేరుకున్నాయి. అద్భుత శిల్పసౌందర్యంతో చారిత్రాత్మకత ఉట్టిపడేలా, ఆధ్యాత్మిక వాతావారణం వెల్లివిరిసేలా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఐదేళ్ల కిందట ప్రారంభమైన పనులు పూర్తి కావచ్చాయి. నలుదిక్కులా విశాలమైన మాఢవీధులు, సప్త గోపురాలు, అంతర్ బాహ్య ప్రాకారాలు, ఆల్వార్ల విగ్రహాలతో కాకతీయ సంప్రదాయ కృష్ణశిలా శిల్పసౌరభం ఉట్టిపడేలా పనులు జరిగాయి. కొండపై ప్రధాన ఆలయ నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. శివాలయం కూడా సిద్ధమైంది. ఇప్పటికే యాదాద్రి ప్రధానాలయం పనులు పూర్తికావడంతో ఫిబ్రవరి 18 నుంచి 21వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు, 22 నుంచి 28 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అప్పటికే ప్రధానాలయంలోకి భక్తులను అనుమతించాలని అధికారులు భావిస్తున్నారు. బ్రహ్మోత్సవాల కంటే ముందుగానే భక్తులకు దర్శనం కల్పిస్తే.. బ్రహ్మోత్సవాల సమయానికి అన్నీ సర్దుకుంటాయనే భావనలో యాడా ఉంది.
ఆధ్యాత్మిక కళాకృతులు, శిల్ప సంపద..
స్వామి వారి కైంకర్యాల కోసం కొండపైన పుష్కరిణి కూడా పూర్తి స్థాయిలో తయారైంది. కొండ కింద భక్తుల సౌకర్యార్థం మరో పుష్కరిణి పనులు జరుగుతున్నాయి. మెట్లు, ఇతర నిర్మాణల పనులు కొనసాగుతున్నాయి. ప్రెసిడెన్షియల్ కాటేజీ సహా వీఐపీ కాటేజీల నిర్మాణం కూడా పూర్తైంది. 15 కాటేజీలలో ఒకటి మినహా అన్ని పనులు పూర్తయ్యాయి. కళ్యాణకట్ట ఇంకా సిద్ధం కాలేదని అధికారులు వెల్లడించారు. పక్కనే ఉన్న దీక్షాపరుల మండపాన్ని ప్రస్తుతానికి కళ్యాణకట్టగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆధ్యాత్మిక కళాకృతులు, శిల్ప సంపద, ప్రకృతి అందాలతో కూడిన పచ్చదనం ఈ క్షేత్రంలో పొందుపరిచారు. రూ. రెండు వేల కోట్లతో సీఎం కేసీఆర్ నిర్మాణం చేపట్టిన ఈ క్షేత్రం ఇప్పటికే భక్తుల మన్ననలను పొందుతోంది. స్వామి అమ్మవార్ల దర్శనాలకు ఎప్పుడెప్పుడా అని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఆలయంలో ఇప్పటికే పన్నెండు మంది నమ్మాళ్వార్లు తొందరపొడి, తిరుమంగై, గోదా అమ్మవారు, పుదత్తా వంటి ఆళ్వారులను అందంగా తయారు చేసి ఆలయ ముఖ మండపంలో ఏర్పాటు చేశారు. ఆలయంలో ముఖమండపం, అలంకార మండపం, నిత్య కల్యాణ మండపం వంటి మండపాల నిర్మాణం కూడా పూర్తి చేశారు. ఉదయం స్వామి అమ్మవార్లకు సుప్రభాతం వేళ ఆలయ అర్చకులు ప్రత్యేకంగా పంచ సూక్తాలూ పఠనం చేసేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు . ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఎదురుగా ధ్వజ స్తంభం దానికి వెనకాల బలిపీఠం ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఈ బలిపీఠంపై అన్నంతో చేసిన గరుడ ముద్దలను పెట్టి తీర్థం సంప్రోక్షణ చేస్తారు. ఆలయం పైభాగాన పూర్వ వైభవాన్ని గుర్తు తెచ్చేలా కాకతీయుల కాలంనాటి శిల్పసంపదను చెక్కించారు. ఆలయం పైభాగాన మాడవీధులను ఏర్పాటు చేశారు.
చినజీయర్‌ను సంప్రదించి..
ఫిబ్రవరి 16 వసంతపంచమి, 18న రథసప్తమి ఉన్న నేపథ్యంలో అప్పుడే పున:ప్రారంభం ఉండవచ్చని భావిస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారం వరకు ముఖ్యమంత్రి నిర్దేశించిన పనులన్నీ పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ముహూర్తానికి సంబంధించి సీఎం చినజీయర్ స్వామిని సంప్రదించి తుదినిర్ణయం తీసుకోనున్నారు. సీఎం నిర్ణయానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు. గర్భాలయం తిరుమాడ వీధులు పూర్తయ్యాయి. ఆలయానికి సంబంధించిన కరెంటు ఏసీలు, డ్రైనేజీ, ప్రసాద విక్రయశాలకు సంబంధించిన పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఇక మిగిలింది భక్తులకు వసతి మాత్రమే. వీటిని సైతం అధికారులు తొందరగా పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారు. వీటి కోసం ఈనెల 27న సీఎంఓ కార్యదర్శి భూపాల్ రెడ్డి నూతన ప్రధాన ఆలయాన్ని మరోసారి సందర్శించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 18వ తేదీ లోపల మిగిలిన పనులు పూర్తి కావాలని అధికారులు చెబుతున్నారు. క్యూలైన్లు, మంచినీటి వసతి, టాయిలెట్లు, క్యూ కాంప్లెక్సులు తదితరాలపై దృష్టి సారించారు.
రామానుజకూటమి..
యాదాద్రిలో నిత్యం స్వామి అమ్మవార్లకు నిత్య నైవేద్యం ఏర్పాటు చేస్తారు. ఇది స్వామి అమ్మవార్లకు నివేదన కాకముందు ఎవరూ చూడకూడదని, సంప్రదాయ రీతిలో ఆలయంలోనికి తీసుకుని వెళతారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆలయంలోనికి ఆలయ పాచకులు (స్వామివారి కోసం నివేదన తయారు చేసేవారు) నైవేద్యం తీసుకుని వెళ్లేందుకు ప్రత్యేక లిఫ్టులు ఏర్పాటు చేశారు. మిగతా సమయంలో వికలాంగులకు, వృద్ధులకు, గర్భిణులకు ఈ లిఫ్టును ఉపయోగించుకుంటారు. ఈ ఆలయం చూడడానికి ప్రతి భక్తుడికి దాదాపు నాలుగు గంటల పాటు సమయం పడుతుందని అదికారులు అంటున్నారు. ఆలయాన్ని ఆలయ వైభవం కళ్లు చెదిరే శిల్పాల ఆకృతిలో చూడడానికి సమయం సరిపోదు .
అధునాతన టెక్నాలజీతో ప్రసాద విక్రయశాల..
దాదాపు రెండు సంవత్సరాల వరకు రద్దీని తట్టుకునే విధంగా ప్రత్యేక వసతులను ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి రోజు ఎంతమంది భక్తులు వచ్చినా లడ్డూ ,పులిహోర వడా ప్రసాదాలను విక్రయించే విధంగా చూస్తున్నారు. అధునాతన టెక్నాలజీతో బెంగుళూరుకు చెందిన ఇస్కాన్ టెంపుల్ , అక్షయ పాత్ర అనే సంస్థల ఆధ్వర్యంలో ఈ ప్రసాద విక్రయశాలను నడిపించే అవకాశం ఉంది. రోజూ లక్షల లడ్డూలను, దాదాపు లక్షన్నర పులిహోర ప్యాకెట్లను తయారు చేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. తిరుమలను తలపించే విధంగా భక్తుల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఔషధ మొక్కలతో అందమైన గ్రీనరీ..
యాదాద్రిలో ఎక్కడ చూసినా పచ్చదనం, పచ్చదనం.ఆలయానికి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు రోడ్డు మధ్యలో అందమైన చెట్లు దర్శనమిస్తున్నాయి.అలాగే ఆలయం చుట్టూ పచ్చదనంతో నింపే ఆహ్లాదకరమైన వాతావ రణాన్ని తీసుకువచ్చారు. అలాగే స్వామి అమ్మవార్లకు ఆలయం నిత్య కైంకర్యం లోనూ వాడేందుకు సుగంధ ద్రవ్యాల చెట్లు తులసి,గులాబీ,మందారం, చంపక, మల్లికా వంటి పూల మొక్కలు పెంచుతున్నారు. ప్రస్తుతం భక్తుల కోసం రెండు ఘాట్ రోడ్లు ఉండగా, నిర్మాణం పనుల కోసం ఒక్కటే వాడుతున్నారు. రెండవది కూడా త్వరలో వాడు తారు.అలాగే ఆలయానికి వెనుక భాగంలో ఉన్న వీఐపీ సూట్లు నుంచి మూడో ఘాట్రోడ్డును ప్రత్యేకంగా వీఐపీ కోసం నిర్మాణం చేస్తున్నారు.ఇది ప్రస్తుతం నిర్మాణ దశలోనే ఉంది.
ప్రత్యేకమైన క్యూలైన్లు..
భక్తులు క్యూ కాంప్లెక్స్ నుంచి క్యూలైన్లో చేరి స్వామి అమ్మవార్లను దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తిరుమలకు సమీపంలోని గోల్డెన్ టెంపుల్ ఆలయంలో మాదిరిగా ప్రత్యేకంగా ఇత్తడితో తయారుచేసిన క్యూలై న్లను తయారుచేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. క్యూకాంప్లెక్స్ లో స్టీల్తో తయారుచేసిన క్యూలైన్ల ను ఏర్పాటు చేస్తున్నారు. క్యూలైన్లలో చేరింది మొదలు.. ఆలయంలోని స్వామి అమ్మవార్లను చేరేవరకు భక్తుడు దాదాపు రెండు కిలోమీటర్ల మేర నడవాల్సి ఉంటుంది. ఆలయం ముందు కోయంబత్తూరు నుంచి ప్రత్యేకంగా తెచ్చిన ఏనుగులు, జయవిజయులు, ద్వారపాలకుల విగ్రహాలు ఆలయానికి ఎంతో అందాన్ని తెచ్చాయి.