త్వరలో యాదాద్రి ప్రారంభోత్సవం

by Shyam |   ( Updated:2021-04-05 10:47:29.0  )
త్వరలో యాదాద్రి ప్రారంభోత్సవం
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ పనులపై నిత్యం సమీక్ష చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వీలైనంత తొందరగా ప్రారంభోత్సవం గురించి ఆలోచిస్తున్నట్లు తెలిసింది. వచ్చే నెల 14వ తేదీన అక్షయ తృతీయ సందర్భాన్ని పురస్కరించుకుని హోమాలు, యాగాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడంపై వేద పండితులతో సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. మంచి ముహూర్త బలం ఉన్న అక్షయ తృతీయ రోజున సుదర్శన హోమంతో మొదలయ్యే ప్రత్యేక పూజలు వరుసగా ఎనిమిది రోజుల పాటు నిర్వహించి తొమ్మిదో రోజున ఉత్సవ మూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపన చేయడానికి సంబంధించి చర్చించినట్లు తెలిసింది.

ఇప్పటికింకా ముహూర్తాన్ని ఖరారు చేయకపోయినప్పటికీ మే 14వ తేదీ నుంచి పూజలు మొదలుపెట్టడం గురించి మాత్రం ప్రాథమిక స్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయి. చిన జీయర్ తీసుకునే నిర్ణయం ఆధారంగా యాదాద్రి ఆలయానికి సంబంధించి సీఎం కేసీఆర్ తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని గర్భగుడి విషయంలో ఎలాంటి మార్పు లేదు. శివ, వైష్ణవ ఆలయాల్లో మూల విరాట్టులకు కూడా ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు. కానీ ఉత్సవమూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం మాత్రం మే 22వ తేదీ ఉండవచ్చని ప్రాథమిక సమాచారం.

అక్షయ తృతీయ రోజున మొదలయ్యే పూజల్లో భాగంగా జలాధివాసం, ధాన్యాదివాసం లాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఉండొచ్చని పండితుల అభిప్రాయం. 1008 కుండాలతో పాటు అగ్నికుండాలను ఏర్పాటుచేసి సుదర్శన హోమం నిర్వహించాల్సి ఉంటుందని, పాంచరాత్ర ఆగమ విధానం ప్రకారం పూజాదికాలు ఉంటాయని పండితుడొకరు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆలయాన్ని సందర్శించి తుది దశలో ఉన్న పనులను సమీక్షించి కొన్ని సూచనలు కూడా చేశారు. అవి పూర్తయ్యే పరిస్థితికి అనుగుణంగా ఆలయ పూజలు, హోమాలు, ప్రారంభోత్సవం తదితరాలకు ముహూర్తం ఖరారవుతుంది.

Advertisement

Next Story