ఫ్లాష్.. ఫ్లాష్.. మరోసారి వివాదంలో ఇరుక్కున్న వైరా ఎమ్మెల్యే (వీడియో)

by Anukaran |   ( Updated:2023-12-15 14:51:18.0  )
ఫ్లాష్.. ఫ్లాష్.. మరోసారి వివాదంలో ఇరుక్కున్న వైరా ఎమ్మెల్యే (వీడియో)
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ నిత్యం ఏదో ఒక వివాదంలో నిలుస్తూనే ఉన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని, అధికార పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు. మొన్న కారేపల్లి మండలంలో స్వయంగా ఆయన అనుచరులు రిగ్గింగ్ చేసి గెలిపిస్తే పట్టించుకోవా..? అంటూ ఆయన్ను నిలదీసిన విషయం తెలిసిందే.

ఆ ఘటన మరవక ముందే అదే మండలం బొక్కల తండాలో మంగళవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఈసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేలా చేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ తెలంగాణ ఇచ్చింది సోనియమ్మే అని స్పష్టం చేశారు.

అంతేకాదు తెలంగాణ ఇచ్చినందుకు ఆమెకు థ్యాంక్స్ చెప్పుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రాంతం వివక్షకు గురైందన్న విషయాన్ని గ్రహించి సోనియా గాంధీ స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చారంటూ చెప్పుకొచ్చారు. అయితే, తెలంగాణ ఎవరి దయాదాక్షిణ్యాలతో రాలేదని, పోరాడి సాధించుకున్నామని కేసీఆర్ పదేపదే చెపుతున్నా టీఆర్ఎస్‌లో ఉన్న రాములు నాయక్ మాత్రం తెలంగాణ ఇచ్చింది సోనియమ్మే అని చెప్పడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు.

అంతేకాదు.. మావోయిస్టులు దేశభక్తులని, వారు చేసే పోరాటంలో తప్పులేదన్నారు. ఇక అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రాములు నాయక్ ఒక ఉచిత సలహా ఇచ్చారు. ప్రజల కోసం పనిచేయకున్నా కనీసం వారికి ఊరట కలిగించేలా ప్రవర్తించాలన్నారు. వైరాగ్యం ఒలకపోస్తూ మంచి, మానవత్వం, దేహం, సేవ.. ఇలా ఏదేదో మాట్లాడారు. అయితే ఒక పక్క టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను, ఆయన పథకాలను పొగుడుతూనే ఇలా మాట్లాడే సరికి అక్కడున్న వారంతా ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక సైలెంట్‌గా విన్నారు.

నాలుగు నెలల క్రితం పూర్తైన రోడ్లకు మళ్లీ ఓపెనింగ్..

రెండు రోజుల క్రితం కారేపల్లి మండలం వెంకటియా తండావాసులు, ఆయన అనుచరులు రాములు నాయక్‌.. తమ గ్రామాన్ని పట్టించుకోలేదంటూ తీవ్రంగా ప్రతిఘటించిన విషయం తెలిసిందే. గిద్దవారిగూడెం, వెంకటియా తండాకు చెందిన రోడ్డు వాస్తవానికి నాలుగు నెలల క్రితమే పూర్తయింది. అప్పటినుంచి రాకపోకలు సాగుతూనే ఉన్నాయి.

అయితే, మంగళవారం ఈ రోడ్లను రాములు నాయక్ కొత్తగా ఓపెనింగ్ చేసి మళ్లీ అబాసుపాలయ్యారు. మొన్న ప్రతిఘటించినందుకు ఎప్పుడో పూర్తయిన రోడ్లను ఇప్పుడు ఓపెనింగ్ చేశారంటూ తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాములు నాయక్ రోజూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వానికి తలనొప్పిగా మారారని పార్టీ నాయకులు కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.

Advertisement

Next Story