అలసిపోయిన అండర్‌టేకర్

by Shiva |
అలసిపోయిన అండర్‌టేకర్
X

దిశ, స్పోర్ట్స్: మార్క్ విలియం కాలావే ఎవరో తెలుసా అంటే ఒక్కరు కూడా మాట్లాడకపోవచ్చు. కానీ, అండర్‌ టేకర్ తెలుసా అంటే ఒక్కసారిగా ఉత్సాహం ఉరకలేస్తుంది. 90ల్లో పరిచయమైన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (అప్పట్లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్)కు ఎంతో మంది ఫ్యాన్స్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు టీవీల్లో ఈ ఫైటింగ్స్ చూసి మైమరచి పోయేవాళ్లు. ఆ ఫైట్స్ చూసి పిల్లలు కూడా అలాగే గొడవ పడుతుండటంతో చాలా కాలంపాటు ఇండియాలో నిషేధించారు. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈగా మళ్లీ అందరి ముందుకు వచ్చింది. ఇది కేవలం వినోదం మాత్రమేనని, నిజంగా తన్నుకోరని అందరికీ చెప్పాల్సి వచ్చింది. అయినా ఈ ఆటకున్న క్రేజ్ తగ్గలేదు. క్రికెట్‌లో సచిన్, ఫుట్‌బాల్‌లో రొనాల్డో, మెస్సీ ఎలాగో రెజ్లింగ్‌లో అండర్ టేకర్ అలాంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. గత 30ఏండ్లుగా రింగ్‌లో ఎన్నో అద్భుత విన్యాసాలు చేసిన ది అండర్‌ టేకర్ ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఇకపై రింగ్‌లోకి అడుగుపెట్టనని, తాను అలసిపోయానని చెప్పాడు. తన రిటైర్మెంట్‌ను ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ‘నాకు తెలుసు చివరి వరకు మీరు నా ఆటను ఆస్వాదించలేరని. ఇప్పుడు కొత్తవాళ్లు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంతవరకు సాధించిన దాన్ని మిగతా జీవితమంతా గుర్తుంచుకుంటాను. ఇక సెలవు’ అని పేర్కొన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో రెజిల్ మేనియాలో భాగంగా ఏజే స్ట్రైల్స్‌తో జరిగిన మ్యాచే తనకు చివరిదని అండర్ టేకర్ పేర్కొన్నాడు. అండర్ టేకర్ రిటైర్మెంట్ సందర్భంగా ముంబయి ఇండియన్స్ జట్టు అభినందనలు తెలిపింది. కెప్టెన్ రోహిత్ శర్మ డబ్ల్యూడబ్ల్యూఈ బెల్ట్ పట్టుకున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో ఉంచింది.

Advertisement

Next Story

Most Viewed